ప్లీజ్‌… ప్లీజ్‌!

కాంగ్రెస్ అధ్య‌క్ష రేస్‌లో ఉన్న లోక్‌స‌భ స‌భ్యుడు మ‌ల్లిఖార్జున‌ ఖ‌ర్గే ప్ర‌చారం నిమిత్తం శ‌నివారం హైద‌రాబాద్ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గాంధీభ‌వ‌న్‌లో టీపీసీసీ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. మ‌ల్లిఖార్జున‌ ఖ‌ర్గేకు వ్య‌తిరేకంగా బ‌రిలో నిలిచిన…

కాంగ్రెస్ అధ్య‌క్ష రేస్‌లో ఉన్న లోక్‌స‌భ స‌భ్యుడు మ‌ల్లిఖార్జున‌ ఖ‌ర్గే ప్ర‌చారం నిమిత్తం శ‌నివారం హైద‌రాబాద్ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గాంధీభ‌వ‌న్‌లో టీపీసీసీ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. మ‌ల్లిఖార్జున‌ ఖ‌ర్గేకు వ్య‌తిరేకంగా బ‌రిలో నిలిచిన మ‌రో కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చారు.

అయితే ఆయ‌న్ను క‌ల‌వ‌డానికి టీపీసీసీ ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అండ‌దండ‌లున్నాయి. దీంతో మ‌ల్లిఖార్జున‌ ఖ‌ర్గే గెలుపు ఖాయ‌మైంది. ఈ నేప‌థ్యంలో శ‌శిథ‌రూర్‌ను క‌నీసం క‌ల‌వ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈ నేప‌థ్యంలో కాబోయే కాంగ్రెస్ అధినాయ‌కుడు మ‌ల్లిఖార్జున‌ ఖ‌ర్గేను క‌ల‌వ‌డానికి టీపీసీసీ నేత‌లు ఉత్సాహం చూపారు. గాంధీభ‌వ‌న్‌లో ఖ‌ర్గే మాట్లాడుతూ ఈ నెల 17న జ‌ర‌గ‌నున్న పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. త‌న‌కు ఓటు వేయాల‌ని పీసీసీ స‌భ్యుల్ని అడిగేందుకు హైద‌రాబాద్ వ‌చ్చాన‌న్నారు.  136 ఏళ్ల కాంగ్రెస్ చ‌రిత్ర‌లో అధ్య‌క్ష స్థానానికి ఐదో ద‌ఫా ఎన్నిక జ‌రుగుతోంద‌న్నారు. ఆ ఐదో వ్య‌క్తి తానే అన్నారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా త‌న‌ను ఎన్నుకుంటే పార్టీ బ‌లోపేతానికి శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తాన‌న్నారు.

ప్ర‌ధాని మోదీ, కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్‌షా క‌లిసి దేశాన్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. కొంద‌రిని మాత్ర‌మే బీజేపీ ఐశ్వ‌ర్య‌వంతుల్ని చేస్తోంద‌ని మండిప‌డ్డారు. దేశంలో ప్ర‌జాస్వామ్యం బ‌తికి బ‌ట్ట క‌ట్టాలంటే మోదీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. దేశంలోని ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌మై మోదీని ఓడించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా పేరు పేరునా ఆయ‌న ఓటు వేయాల‌ని అభ్య‌ర్థించారు.