విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఏంటి అని అడగడానికి ఏ జ్యోతీష్కుడినీ సంప్రదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తల రాత అలా తాటి కాయ అంతటి అక్షరాలతో కళ్ల ముందు కనిపిస్తోంది. ఆ నుదుటి రాతను గట్టిగా దిద్దిన వారు కూడా పెద్ద నోరు వేసుకుని మాట్లాడుతున్నారు కూడా.
అందువల్ల విశాఖ స్టీల్ విషయంలో అద్భుతాలు ఏవో జరిగిపోతాయని ఎవరికీ నమ్మకాలు అయితే లేవు. అంగట్లో ఉక్కు కర్మాగారం ఉంది. బేరానికి పెట్టేశారు. కొనేవారు ఎవరో మాత్రం తెలియదు. కేంద్ర పెద్దల మదిలో ఒక పేరు ఉంది. ఆయనకే ఇస్తారని కూడా ప్రచారం అయితే సాగుతోంది.
అదానీ విశాఖ స్టీల్ ని కొంటారని ఇప్పటిదాకా ప్రచారం అయితే సాగింది. ఇదే నిజం అవుతుంది అని కూడా అనుకున్నారు. తాజాగా టాటా స్టీల్ విశా స్టీల్ ప్లాంట్ ని టేకోవర్ చేస్తామని గంభీరమైన ప్రకటన చేయడం అతి పెద్ద ట్విస్ట్ గానే చూడాలి.
ఇక స్టీల్ ప్లాంట్ ని కొనడానికి గల కారణాలను టాటా స్టీల్ సీఈఓ టి.వి. నరేంద్రన్ బయటపెట్టినపుడు మాత్రం విశాఖ వాసుల మనసు బాధతో మూలుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే సాగర తీరంలో ఉన్న అతి పెద్ద ప్లాంట్. అంతే కాదు పోర్టు రవాణా సదుపాయం ఉంది.
ఇక 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం కూడా కలిగి ఉన్న పెద్ద కర్మాగారం. అందుకే తాము టేకోవర్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నామని సీఈఓ టి.వి. నరేంద్రన్ చెబుతున్నారు. అంటే బంగారం లాంటి ఉక్కు అని ఆయనే చెప్పారు.
మరి ఈ బంగారం అమ్ముకోవడం అంటే దౌర్భాగ్యంగానే చూడాలి. కానీ కధ చాలా దూరం వెళ్ళిపోయింది. ఇపుడు టాటావా ఆదానీవా, లేక మరొకరా అన్నది తేలాలి. ఏది ఏమైనా స్టీల్ ప్లాంట్ కి భలే మంచి బేరాలే వస్తున్నాయి అంటే ఇక స్టీల్ ప్రైవేటీకరణ ఆపడం బ్రహ్మ తరం కూడా కాదు అని అర్ధమవుతున్న సత్యం