భారత్ రాష్ట్ర సమితి తరఫున దేశవ్యాప్తంగా జనాదరణ కూడగట్టుకోవడంలో ఎలాంటి కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగాలో కేసీఆర్ పథకరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. హైదరాబాదులో త్వరలో జాతీయ దళిత కాంక్లేవ్ నిర్వహించబోతున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ప్రకటన తర్వాత ఆయనను అభినందించడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన దళిత నాయకులతో సమావేశమైనప్పుడు కేసీఆర్ ఈ విషయం వెల్లడించారు.
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకోవడం ఒక్కటే లక్ష్యంగా అడుగులు కదుపుతున్న కేసీఆర్.. దళిత ఓటు బ్యాంకు మీద దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల పార్టీగా ఒక ముద్ర ఉన్న నేపథ్యంలో.. దళితులను కూడగట్టి లబ్ధి పొందే దిశగా ఇది ప్రయత్నం కావచ్చు.
కేసీఆర్- బిఆర్ఎస్ నిర్వహించే దళిత కాంక్లేవ్ కు జాతీయ స్థాయిలో దళిత నాయకులు, దళిత ఉద్యమకారులు అందరినీ ఆహ్వానించనున్నట్లు కేసిఆర్ చెబుతున్నారు. కేవలం ఇలాంటి ఒక సదస్సు నిర్వహించడం ద్వారా.. ఆ సదస్సు వేదిక మీద నుంచి దళితుల కోసం బోలెడన్ని ఆకర్షణీయమైన వరాలను కురిపించడం ద్వారా.. దళితుల ప్రేమను పొందడం అంత ఈజీగా సాధ్యమవుతుందా? అనేది ప్రజల్లో మెదులుతున్న సందేహం! దళితుల పట్ల కెసిఆర్ గతంలో అనుసరించిన వైఖరి వలన అనేక సందేహాలు వారిలో తలెత్తుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ అప్పట్లో చాలా ఘనంగా ప్రకటించారు. ఆ ప్రకటన నమ్మి.. ఆశతో ఆయన పార్టీలో చేరినవారూ ఉన్నారు. ఉద్యమ సమయంలో ఆయన ప్రకటనను దళిత సమాజం నమ్మింది. కానీ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ మాట మార్చారు. తన మార్కు ఏమిటో చూపించారు. దళితుల ఆశలను మంటగలుపుతూ తానే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. దళితుల కోసం ఎన్ని పథకాలు ప్రకటించినా ఆ అపకీర్తి ఆయన ఖాతాలో శాశ్వతంగా మిగిలిపోయింది.
ఇప్పుడు జాతీయ పార్టీ రూపేణా.. టిఆర్ఎస్ కొత్త అవతారంలోకి మారుతున్నప్పుడు.. దేశవ్యాప్తంగా దళితుల విశ్వాసాన్ని చూడడం అంత ఈజీనా? సీఎం పీఠం ఎరవేసి దళితులను వంచించిన సంగతి ఎవరూ ప్రశ్నించకుండా ఉంటారా? అనేది సందేహం.
ఇందుకు ఒక్కటే పరిష్కారం ఉంది. దళిత కాంక్లేవ్‌లో తెలంగాణకు తదుపరి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని కేసీఆర్ ప్రకటించాలి. అలాంటి దళిత అనుకూల ట్విస్ట్ లేకుండా.. కేసీఆర్‌ను ఆ వర్గం ఎందుకు నమ్మాలి? 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేసి తాను జాతీయ రాజకీయాల్లో ఉంటానని తేల్చి చెప్పాలి! అలాంటి సీరియస్ నిర్ణయాన్ని వెలువరిస్తే మాత్రమే కేసీఆర్ దళిత ప్రేమను ప్రజలు నమ్ముతారు. అలా చేయగలిగితే దళిత కాంక్లేవ్ నిర్వహించాల్సిన అవసరం కూడా లేదు.. యావత్తు దేశంలో దళితులంతా ఆయనను కీర్తిస్తారు.. అక్కున చేర్చుకుంటారు.. పట్టం కడతారు!!