భారత్ రాష్ట్ర సమితి పేరుతో తెరపైకి వచ్చిన కొత్త పార్టీ విషయంలో తెలంగాణకు దాయాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో నాయకులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ప్రత్యేకించి వైసీపీ నాయకులు ఆచితూచి మాట్లాడుతున్నారు. బిఆర్ఎస్ ప్రస్థానం గురించి.. తీవ్రంగా వారిని ప్రతిపక్షంగా పరిగణిస్తూ ఓ ఆటాడుకోవాలా? లేదా, చూసీచూడనట్టుగా వేచిచూసే ధోరణి అవలంబించాలా? అనేది వారింకా తేల్చుకోలేకపోతున్నారు.
బిఆర్ఎస్ విషయంలో వైసీపీ నాయకుల్లో ఇంకా మీమాంస నడుస్తోంది. కెసిఆర్ ను, బిఆర్ఎస్ రూపంలో మొదలైన ఆయన ప్రయత్నాన్ని దారుణంగా తిట్టిపోయాలా? లేదా? ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే టిఆర్ఎస్ వైసిపిల మధ్య స్నేహ సంబంధాలే ఉన్నాయి. కేసీఆర్– జగన్ మధ్య మంచి అనుబంధమే ఎస్టాబ్లిష్ అయింది. అయితే కొన్ని వారాలుగా టిఆర్ఎస్ నాయకులు జగన్ మీద విమర్శలు చేయడం.. ఏపీ సచివులు ప్రతి విమర్శలు చేయడం ఈ గోలంతా నడిచింది! ఇప్పుడు బిఆర్ఎస్ ప్రకటన తర్వాత ఎలా ప్రతిస్పందించాలో వైసిపి ఇదమిత్థంగా ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా పోటీ చేసినంత మాత్రాన వైసీపీకి జరిగే నష్టం ఏమాత్రం లేదు. అయితేగియితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును వారు చీల్చడం వలన ఎంతో కొంత మేలు జరుగుతుంది. కానీ ఆ సంతోషాన్ని కూడా వైసిపి నాయకులు బహిరంగంగా చెప్పుకోవడానికి వీల్లేదు. అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో సీరియస్ గా వేలు పెట్టి జగన్ మీద నిందలు వేయడం మొదలుపెడితే అప్పుడు వారి ప్రతిస్పందన ఇంకోరకంగా ఉంటుంది. కేసీఆర్ ఏపీలో ఎన్నికల సభ పెట్టి మాట్లాడాల్సి వస్తే గనుక.. జగన్ మీద ఏంచెప్పినా చెప్పకపోయినా.. చంద్రబాబు చేతగానితనం గురించి మాత్రం ఒక రేంజిలో విమర్శలు గుప్పించగలరని వైసీపీ నాయకుల్లో ఓ ఆశ కూడా ఉంది.
చంద్రబాబు గురించి తామెవ్వరూ తిట్టలేనంత దారుణంగా తిట్టగల ఏకైక వ్యక్తి కేసీఆర్ అని వారి విశ్వాసం. కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టి.. చంద్రబాబు మీద నిప్పులు చెరిగారంటే.. ఆ ప్రతిపక్షనేత ఈ మూడేళ్లలో ప్రజల్లో ఏదైనా జాలి కూడగట్టుకుని ఉంటే.. అదంతా కూడా మంటగలిసిపోతుందని కూడా వైసీపీ వారు నమ్ముతున్నారు.
అప్పటివరకు ఏపీ రాజకీయాల్లోకి టిఆర్ఎస్ వస్తే మనకు లాభమే కదా అనే ధోరణిలోనే వైసీపీ భావిస్తుంది భావిస్తోంది. అందుకే బిఆర్ఎస్ విషయంలో ఎలా స్పందించాలో తేల్చుకోవడానికి ఇంకా సమయం ఉందని.. వైసీపీ నాయకులు ఆచితూచి మాట్లాడుతున్నారు.