టీఆర్ఎస్ ప్రస్థానంలో ఓ కీలక ఘట్టం. తెలంగాణ సాధన కోసం అవతరించిన టీఆర్ఎస్, ఇంతింతై అన్నట్టుగా… భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా కొత్త రూపును సంతరించుకుంది. ఈ కీలక, చారిత్రక సమావేశంలో పాల్గొనడం ప్రతి టీఆర్ఎస్ నేత మధురాభూతిగా భావిస్తారు. అలాంటి సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డుమ్మా కొట్టడంపై విస్తృత చర్చ జరుగుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు కూడా ఉందని బీజేపీ నేతలు ఘాటు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్ వివాదంతో నైతికంగా తనకు డ్యామేజీ అయ్యిందని కవిత ఆవేదన చెందుతున్నారు. అందుకే ఆమె కోర్టును ఆశ్రయించి లిక్కర్ స్కామ్లో తన పేరు ప్రస్తావించకుండా సానుకూల ఆదేశాలు పొందారు. లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో కవిత ఇప్పుడిప్పుడే కాస్త రిలాక్ష్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశానికి కవిత రాకపోవడం సహజంగానే టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నగరంలో ఉన్నప్పటికీ కవిత ఎందుకు రాలేదనే అంశంపై పార్టీలో అంతర్గత చర్చకు తెరలేచింది. బీఆర్ఎస్ ఆవిర్భావం ఆమెకు ఇష్టం లేదా? అనే అభిప్రాయం కూడా లేకపోలేదు.
అసలే కేటీఆర్, కవిత మధ్య విభేదాలున్నాయనే ప్రచారం నేపథ్యంలో కవిత డుమ్మా కొట్టడం ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్టైందనే అభిప్రాయం లేకపోలేదు. సమావేశానికి డుమ్మా కొట్టడంపై కవితనే క్లారిటీ ఇస్తే బాగుంటుందని పార్టీ నేతలు కొందరు అంటున్నారు.