భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావంపై వివిధ రాజకీయ పక్షాలు తమదైన రీతిలో స్పందిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో బీఆర్ఎస్ ఎంటర్ అవుతుందని, అప్పుడు ఏ పార్టీకి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అసలు ఆ పార్టీ ఉనికిని గుర్తించడానికి కూడా ఆయన నిరాకరించినట్టుగా…. ఆయన మాటలు వింటే అర్థమవుతుంది.
బీఆర్ఎస్ గురించి తాము విశ్లేషించే స్థితిలో లేమని సజ్జల కొట్టి పారేశారు. ఆ పార్టీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పకనే చెప్పారు. అయితే ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన తెలిపారు. కొత్త పార్టీ వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. కొత్త పార్టీ రాకతో పోటీ పెరిగి పనితీరు మరింత మెరుగుపరుచుకుంటామని ఆయన అన్నారు.
ప్రజల కేంద్రంగా విధానపరమైన అంశాలతో కొత్త పార్టీ వస్తే మంచిదే అన్నారు. కానీ పక్క రాష్ట్రాల గురించి తాము మాట్లాడలేదన్నారు. వాళ్లు అక్కడి విషయాలు వదిలేసి, తమ గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. భవిష్యత్ రాజకీయాల కోసం వాళ్లు అలా చేస్తున్నారేమో తెలియదని చెప్పుకొచ్చారు.
తాము ఇక్కడి వ్యవహారాలకు మాత్రమే కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. తాము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన నేరుగానే చెప్పారు. పైగా తమ గురించి తెలంగాణ అధికార పార్టీ నేతలు విమర్శలు చేయడం వెనుక భవిష్యత్ రాజకీయాలున్నాయని విమర్శించారు.