నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు వైసీపీవే. కానీ అంతర్గత రాజకీయాలు మాత్రం అక్కడ పార్టీ పరువుని పదే పదే బజారున పడేస్తున్నాయి. ఎమ్మెల్యేలలో ఒకరంటే ఒకరికి పడటం లేదని అర్థమవుతోంది.
ఇటీవలే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ పంచాయితీ కోసం జిల్లాకు వచ్చి వెళ్లారు. తాజాగా మరోసారి ఈ పోరు బజారునపడింది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రస్తుత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య కోల్డ్ వార్ ముదిరింది.
వివాదం ఎక్కడ మొదలైంది..?
వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన రామనారాయణ రెడ్డిని కాదని అనిల్ కు సీఎం జగన్ మంత్రి పదవి ఇవ్వడంతోనే ఆ రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఆనం కుటుంబ చలవతో అనిల్ రాజకీయ అరంగేట్రం చేశారని, ఇప్పుడు తమకే ఎదురు నిలబడ్డారని ఆ వర్గం అసంతృప్తితో ఉంది. ప్రస్తుతం అనిల్ నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఆనం రామనారాయణ రెడ్డి తనకు సంబంధం లేని వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సిటీలో మాత్రం ఆనం వర్గానికి కూడా పట్టు ఉంది. ఓ దశలో ఈ గొడవలు ముదిరి.. సిటీ నాది, సిటీలో రాజకీయం మాదేనంటూ ఆనం రామనారాయణ రెడ్డి హుంకరించారు. సిటీలో గడప గడపకు వెళ్తామని, తమ వర్గానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇప్పుడేమైంది..?
ప్రస్తుతం ఆనం, అనిల్ మధ్య మరో గొడవ మొదలైంది. నెల్లూరు పట్టణంలో కొత్తగా ఫ్లైఓవర్ కడుతున్నారు. దానికి సంబంధించి మినీ బైపాస్ రోడ్డులో మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి విగ్రహాన్ని తొలగించాల్సి వస్తోంది. సరిగ్గా పిల్లర్ అక్కడికే రావడంతో విగ్రహాన్ని తొలగించేశారు సిబ్బంది. ఈ విషయంలో ఆనం రామనారాయణ రెడ్డి నొచ్చుకున్నారు. తన తండ్రి విగ్రహాన్ని తనకు తెలియకుండా తొలగించారని సన్నిహితుల వద్ద వాపోయారు. అనిల్ కు తాము రాజకీయం నేర్పిస్తే, ఇప్పుడు తమనే అవమానిస్తున్నారని బాధపడ్డారట.
దానికి ప్రతిగా వెంకటగిరిలో చేపట్టే ఏ అభివృద్ధి పనుల్లోను శంకుస్థాపన ఫలకాలపై అనిల్ పేరు లేకుండా చేశారట. ఈ వ్యవహారం కలెక్టర్ వద్దకు వెళ్లింది, ఇన్ చార్జి మంత్రి బాలినేని కూడా ఆనంకు నచ్చజెప్పాలని చూసినా ఫలితం లేదు. చివరకు కొన్నిచోట్ల మంత్రి అనిల్ పేరుని పేపర్ పై రాసి, శిలా ఫలకాలపై అతికించడం విశేషం.
రగులుతున్న రాజకీయాలు..
ఇటీవల గ్రావెల్ తవ్వకాల వ్యవహారంలో సాక్షాత్తూ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిపై పోలీసులు కేసు పెట్టడం సంచలనంగా మారింది. అధికార పార్టీ ఎంపీపై కేసు ఎందుకు పెట్టారని ఆరా తీస్తే, జలవనరుల శాఖ సిబ్బంది పాత్ర అందులో ఉందని తేలింది. దీంతో అనిల్ పై ప్రతిపక్షం కూడా విమర్శలు చేసింది.
ఈ పంచాయితీ కోసమే ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరు వచ్చి వెళ్లారు. జిల్లా ఇన్ చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి కూడా ఈ వ్యవహారాలన్నీ తలనొప్పిగానే మారాయి. కొత్తగా ఆనం విగ్రహం విషయంలో ఆగ్రహావేశాలు మొదలయ్యాయి.