రోజూ నటనే అంటే ఆ హీరోయిన్‌కి విసుగొచ్చినట్టుంది. ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన హీరోయిన్ కంగనా రనౌత్‌ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. దర్శకురాలిగా తనను తాను నిరూపించుకోవాలని ఆమె తహతహలాడుతున్నారు. నటిగా ‘తలైవి’ (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం), ‘థాకడ్’, ‘తేజస్’ అనే చిత్రాలు కంగనా చేతిలో ఉన్నాయి. నటన పరంగా ఆమె ఎంతో బిజీ.
‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’లో టైటిల్ రోల్ చేసిన ఆమె ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు కూడా. దాంతో సంతృప్తి చెందని కంగనా ఇప్పుడు ‘అపరాజిత అయోధ్య’ సినిమాతో పూర్తి స్థాయి దర్శకురాలిగా సొంత ముద్ర వేసుకోవాలని అడుగులు వేస్తున్నారు. యాక్షన్, కట్ చెప్పడానికి ఆమె సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు కూడా. రామమందిరం కేసు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
ఈ విషయమై కంగనా మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ముందు నేను డైరెక్టర్‌గా ఉండాలనుకోలేదు. కాన్సెప్ట్ లెవల్‌లో మాత్రమే ఇన్‌వాల్వ్ అయ్యాను. నేను నిర్మాతగా మాత్రమే ఉండాలనుకున్నాను. ఈ సినిమాకు నాతో అసోసియేట్ అయినవారు నేను డైరెక్ట్ చేస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. హిస్టారికల్ మూవీ ‘మణికర్ణిక’ చిత్రం డైరెక్షన్‌లో నా వంతు భాగం ఉంది. ‘అపరాజిత అయోధ్య’ను డైరెక్ట్ చేయడానికి ఆ అనుభవం ఉపయోగపడుతుంది’ అని కంగనా వివరించారు.