ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పటికి పలుమార్లు భేటీ అయ్యారు. కొన్నిరోజుల కిందట కూడా ఇలాంటి భేటీ జరిగింది. ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకోవడం గురించి ఇద్దరూ చర్చించుకున్నట్లు వార్తలు వచ్చాయి. సెక్రటేరియేట్ భవనాలను తిరిగి తెలంగాణకు అప్పగించడం ఇప్పటికే పూర్తయింది. మిగిలిన ఉమ్మడి ఆస్తుల పంపకాలన్నీ ఈనెలలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. జగన్ విదేశాలనుంచి తిరిగివచ్చిన తర్వాత.. మూడోవారంలో ఏపీలో మరోసారి జరగబోయే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇవి తేలుతాయి.
అయితే గురువారం భేటీ సందర్భంగా ఒక ఆసక్తికరమైన అంశం తెలుస్తోంది. ఈ భేటీలో జగన్ రెండునెలల పాలన అనుభవాల గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. మేనిఫెస్టోను అమలు చేయడంలో ఏయే నిర్ణయాలు తీసుకున్నామో.. సభ ఎలా నిర్వహించామో జగన్ వివరించారు. ఆ క్రమంలో జగన్మోహన రెడ్డి సర్కారుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీర్తి ప్రతిష్టలను పెంచేస్తున్న అమ్మఒడి పథకాన్ని యథాతథంగా కాపీకొట్టే ఉద్దేశంతో కేసీఆర్ వివరాలు రాబట్టినట్టు కూడా తెలుస్తోంది.
గత ప్రభుత్వపు పాలన కాలంలో కేసీఆర్ అన్నదాతకు చేయూత పథకం ప్రారంభించారు. అది సూపర్ క్లిక్ అయింది. దేశంలో కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా కేసీఆర్ స్ఫూర్తితోనే ఇదే తరహా పథకాల్ని ప్రారంభించాయి. కేంద్రంలోని మోడీ సర్కారు కూడా అదే పనిచేసింది. ఇప్పుడు ఏపీలో జగన్ సర్కారు నేతృత్వంలో రూపుదిద్దుకున్న అమ్మఒడి పథకం కూడా అదే తరహాలో దేశానికంతా స్ఫూర్తిదాయకంగా నిలిచే పథకం అని అంతా అనుకుంటున్నారు. పైగా అధికార పార్టీ ఓటు బ్యాంకును పదిలంగా మార్చే పథకం ఇది.
అందువల్ల కేసీఆర్ కూడా ఈ పథకం విధివిధానాలు, ఏపీలో వస్తున్న స్పందన గురించి జగన్ ను ప్రత్యేకంగా అడిగితెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. మంచి పథకం గనుక జగన్ మోహన్ రెడ్డిని కాపీ కొట్టి ఇదే పథకాన్ని తెలంగాణలో తేవడానికి ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.