సెంటిమెంట్స్ ను విపరీతంగా నమ్మే ఇండస్ట్రీ టాలీవుడ్. అలాంటి టాలీవుడ్ లో సెంటిమెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ చంద్రమోహన్. ఈరోజు కన్నుమూసిన ఈ సీనియర్ నటుడ్ని చాలామంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు.
హీరోయిన్ల విషయంలో 'చంద్రమోహన్ సెంటిమెంట్' గురించి అందరికీ తెలిసిందే. అతిలోక సుందరిగా దేశవ్యాప్తంగా ఓ వెలుగువెలిగిన శ్రీదేవి, చంద్రమోహన్ సినిమాతోనే హీరోయిన్ గా మారారు. ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మలుపు తిరిగింది, ఆమె కెరీర్ ఏ స్థాయికి చేరుకుందో అందరికీ తెలిసిందే.
కేవలం శ్రీదేవి మాత్రమే కాదు, జయప్రదకు నటిగా మంచి పేరు తీసుకొచ్చిన సినిమా సిరిసిరిమువ్వ. ఇందులో ఆమె చంద్రమోహన్ సరసన నటించారు. ఈ సినిమా తర్వాతే జయప్రదకు మంచి క్రేజ్ వచ్చింది. ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఇక జయసుధ, విజయశాంతి కూడా కెరీర్ ప్రారంభంలో చంద్రమోహన్ సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకున్నారు.
నిర్మాతలు, సినీ ప్రముఖులకు కూడా..
ఇలా హీరోయిన్లకు మాత్రమే కాదు.. నిర్మాతలకు, కొంతమంది సినీ ప్రముఖులకు కూడా చంద్రమోహన్ సెంటిమెంట్. ఆయన చేతితో డబ్బులు అందుకుంటే, అన్ని రకాలుగా కలిసొస్తుందనే నమ్మకం చాలామందికి ఉండేది. జనవరి 1 వచ్చిందంటే, చాలామంది చంద్రమోహన్ ఇంటికి క్యూ కట్టేవారు. ఆయన చేతిలో ఒక్క రూపాయి అయినా అందుకునేవారు. అలా అందుకుంటే, ఆ ఏడాదంతా బాగుంటుందనేది చాలామంది నమ్మకం.
ఓపెనింగ్స్ లో కూడా చంద్రమోహన్ సెంటిమెంట్ బాగా ఉంది. 80ల్లో చాలా సినిమాల ఓపెనింగ్స్ కు చంద్రమోహన్ ప్రత్యేక అతిథి. ఆయన క్లాప్ కొడితే సినిమా హిట్ అనే సెంటిమెంట్ అప్పట్లో బాగా ఉండేది. ఓవైపు నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, తమ సినిమా ఓపెనింగ్స్ కు రమ్మని చాలామంది చంద్రమోహన్ ను బలవంతం చేసేవారు. అలా మొహమాటం కొద్దీ చాలా ఓపెనింగ్స్ కు చంద్రమోహన్ వెళ్లారు. వాటిలో చాలా సినిమాలు హిట్టయ్యాయి.
చంద్రమోహన్ కు మాత్రం కలిసిరాని డబ్బు…
ఇంతమందికి సెంటిమెంట్ గా మారిన చంద్రమోహన్ కు మాత్రం డబ్బు కలిసిరాలేదు. 900కు పైగా సినిమాలు చేసిన చంద్రమోహన్, ఒక దశలో రెండు చేతులా సంపాదించారు. అదే రేంజ్ లో ఆస్తులు కూడా కూడబెట్టారు. కానీ వాటిని నిలుపుకోలేకపోయారు.
బాగా డబ్బులు సంపాదించే రోజుల్లో చెన్నైలో 5 ఎకరాల స్థలం కొన్నారు చంద్రమోహన్. అయితే దాన్ని చూసుకునేవాళ్లు లేరు. దీంతో చాలా తక్కువ రేటుకు ఆ స్థలాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ స్థలం ఖరీదు 200 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే హైదరాబాద్ శివార్లలో ఆయనకు 15 ఎకరాల ద్రాక్ష తోట ఉండేది. దాన్ని కూడా ఆయన అమ్ముకున్నారు.