తిరుమల శ్రీవారి దర్శనాలకు ఈనెల 11నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. అయితే మునుపటిలాగా కొండపై రద్దీ అనే మాటే కనిపించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు, గంటకి కేవలం 500మందికి మాత్రమే దర్శనాలు. ఉదయం ఆరున్నర గంటలనుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు అంటే.. 13గంటలసేపు మాత్రమే దర్శనాలు.
ఇక కొత్త నిబంధనలు చూస్తే.. ఆగమ శాస్త్రాన్ని కూడా కరోనా ఎలా ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గం మూతపడుతోంది. కేవలం అలిపిరినుంచే భక్తులను అనుమతిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకోడానికి తొట్టతొలి మార్గం శ్రీవారి మెట్టు. అలాంటి మెట్ల మార్గంలోనే ఇప్పుడు భక్తులకు అనుమతి లేదు. ఇక పదేళ్ల లోపు పిల్లలు, 65ఏళ్లపైబడి వృద్ధులకు ప్రవేశం లేదు.
గతంలో ఏడుకొండలవాడి దర్శనాలకి ఇలాంటి అర్హత పరీక్షలేదు, కానీ ఇప్పుడు తప్పనిసరి అయింది. పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికి వచ్చే భక్తులకు ఇది పూర్తి నిరాశే. ఇక స్వామివారి దర్శనానంతరం బయట ఉన్న వకుళమాత ఆలయాన్ని సందర్శించడం భక్తులకు ఆనవాయితీ. లడ్డూలు తయారు చేసే పోటుని వకుళమాత చూసే విధంగా ఆమె ఆలయాన్ని నిర్మించారు.
ఇకపై అంతరాలయంలో ఉపాలయాల దర్శనం ఉండదు, విమాన వెంకటేశ్వరుడ్ని చూడటానికి కూడా సమయం ఇవ్వరు. ఆరడుగుల భౌతిక దూరం పాటిస్తూ కేవలం వెంకటేశ్వరుడిని చూసి తిరుగు ముఖం పట్టాల్సిందే. హుండీ తాకడానికి లేదు, కానుకలు సమర్పించేటప్పుడు కాసేపు ప్రశాంతంగా స్వామిని మనసులో ధ్యానించే అవకాశమూ లేదు. పుష్కరిణి స్నానం లేదు, శఠారి, తీర్థం అసలే లేవు.
ఇక ఆలయం వెలుపల భక్తులకిచ్చే లడ్డూ ప్రసాదం విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం అనుమతివ్వాల్సి ఉంది. నిరతాన్నదాన సత్రం ఒక్కటే ఉంటుంది, మిగతా ప్రాంతాల్లో భక్తుల ఆకలి తీర్చే అన్నదానాలు పూర్తిగా ఆగిపోతాయి. అన్నిటికంటే మించి ఆలయంలో సిబ్బంది, క్షురకులందరికీ పీపీఈ కిట్లు ఇస్తారు. ప్లాస్టిక్ రహితంగా తిరుమల కొండను తీర్చిదిద్దే ఆలోచనలో టీటీడీ ఉండగా.. కరోనా అనివార్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని ఆలయంలో కూడా తప్పనిసరి చేసింది. ప్లాస్టిక్ తో చేసిన వాడి పడేసే ఈ పీపీఈ కిట్లు ఆలయంలో కూడా వాడాల్సిందే. భక్తులు, అర్చక స్వాములు.. ఎవరైనా మాస్క్ ధరించాల్సిందే. అడుగడుగునా శానిటైజర్లు వాడతారు. ప్రతి రెండుగంటలకోసారి ఆలయాన్ని శానిటేషన్ చేస్తారు.
సహజంగా ఆలయంలో ప్రతిరోజూ శుద్ధి కార్యక్రమం ఉంటుంది, కరోనా దెబ్బతో ఇప్పుడది ప్రతి రెండు గంటలకోసారి రసాయనాలతో చేయాలన్నమాట. ఇలా కరోనా ప్రభావంతో సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ మారిపోతున్నాయి. తిరుమల యాత్రే సరికొత్తగా ఉండబోతోంది. థర్మల్ స్క్రీనింగ్ లో ఫెయిలైతే.. అలిపిరి నుంచి నిరాశగా వెనుదిరగాల్సిందే. నలుగురున్న కుటుంబంలో ఒకరికి కాస్త వంట్లో నలతగా ఉన్నా.. కుటుంబం మొత్తం దేవుడి దర్శనానికి నోచుకోదు.
ఒకరకంగా దేవుడు వరమిచ్చినా.. థర్మామీటర్ కనికరించాల్సిందేనన్నమాట. మొత్తమ్మీద తిరుమల శ్రీవారి దర్శనాలు తిరిగి ప్రారంభమవుతున్నాయన్నమాటే కానీ నిబంధనలు పాటించే సరికి తలప్రాణం తోకకి రావడం ఖాయం.