టీడీపీ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడ్డారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో నెట్టుకురావడం వీరికి కష్టంగా కనిపిస్తోంది. మరోవైపు వైసీపీలోకి వెళ్లాలంటే రాజీనామా తప్పదంటూ సీఎం జగన్ మెలికపెట్టారు. ఇటు బీజేపీలోకి వెళ్దామా అంటే కొందరికి మాత్రమే అది లాభదాయకం. ఎంపీలు పార్టీ మారినా కేంద్రంలో పనులు చేయించుకోవచ్చు, ఎమ్మెల్యేల పరిస్థితే అగమ్య గోచరంలా మారింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తికావడంతో మరోసారి టీడీపీ ఆశావహ ఎమ్మెల్యేలు జగన్ తో సంప్రదింపులు జరిపేందుకు ఉత్సాహపడుతున్నట్టు సమాచారం.
బొండా ఉమ లాంటి నేతలు కూడా ఓ క్లారిటీకి రావడంతో ఎమ్మెల్యేలు తర్జన భర్జన పడుతున్నారు. అదే సమయంలో లాభనష్టాలు బేరీజు వేసుకోవడంలో బిజీగా ఉన్నట్టు సమాచారం. పారదర్శక పాలన, అవినీతి లేని సమాజం అంటూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేల చేతులు కూడా కట్టేశారు జగన్. సాక్షాత్తూ మంత్రులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పైరవీలు చేయడానికి భయపడుతున్నారు. రోజులు గడిచినా కూడా జగన్ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఇలాంటి పరిస్తితుల్లో వైసీపీలోకి వెళ్తే లాభమా, నష్టమా అని బేరీజు వేసుకుంటున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.
అసెంబ్లీ ముగిశాక జగన్ ని కలవాలని 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు రెడీ అయినా ఎందుకో వెనక్కితగ్గారు. తాజాగా జగన్ విదేశీ పర్యటన పూర్తయిన తర్వాత ఆయనతో భేటీకి సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు బీజేపీ కూడా టీడీపీ ఎమ్మెల్యేలకు గాలమేస్తోంది. గంపగుత్తగా పార్టీ మారితే ఫిరాయింపు బాధ నుంచి తప్పించుకోవచ్చని, రాజీనామా ఊసే ఉండదని, కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి భవిష్యత్ కి దిగులు ఉండదని నచ్చజెబుతున్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలలో మాత్రం బీజేపీపై ఉత్సాహం కనిపించడం లేదు.
స్థానికంగా చులకన కావడం మినహా దీంతో మరో ప్రయోజనం ఉండదని అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద సీఎం జగన్ వద్దు వద్దంటున్నా టీడీపీ ఎమ్మెల్యేల బ్యాచ్ మాత్రం ఆయన్ను వదిలిపెట్టేలా కనిపించడం లేదు. అతి త్వరలో ఈ వ్యవహారానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ బయటికొస్తుందని టీడీపీ, వైసీపీ వర్గాలంటున్నాయి. ఎవరో ఒకరు, ఏదో ఒక టైమ్ లో ఈ ప్రక్రియ ప్రారంభిస్తే, ఇలా అంతా ఆ బాటలో నడిచి వెళ్లడానికి రెడీగా ఉన్నారు. ఆ ఒక్కరు ఎవరనేది ఇప్పుడు ప్రశ్న.