బాలీవుడ్ లో ఏ ఎఫైర్ ఎటు మలుపు తీసుకుంటుందో అస్సలు చెప్పలేం. అర్బాజ్ ఖాన్ కు మలైకా విడాకులు ఇచ్చినప్పుడు, ఆమె అర్జున్ కపూర్ తో కలుస్తుందని చాలామంది ఊహించలేకపోయారు. దియా మీర్జా విడాకుల కేసులో కూడా ఇలాంటిదేదో ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి బలం చేకూరుస్తూ ఓ బాలీవుడ్ మీడియా ఇచ్చిన కథనం సంచలనం అయింది.
ప్రకాష్ కోవెలమూడి భార్య, రాఘవేంద్రరావు కోడలు కనికా థిల్లాన్ ఈ విడాకులకు కారణం అంటూ ఆ బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. దియామీర్జా భర్త సాహిల్, కనికా కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారని.. ఆ కారణంగానే దియా మీర్జా భర్తకు విడాకులు ఇచ్చిందనేది ఆ బాలీవుడ్ మీడియా కథనం. దీన్ని దియా మీర్జా తీవ్రంగా ఖండించింది.
“సాహిల్-నేను విడిపోవడంపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ ట్వీట్. ఇంత బాధ్యతారాహిత్యంగా కొందరు వ్యవహరించడం దురదృష్టకరం. బాధాకరమైన విషయం ఏంటంటే.. మా విడాకుల వ్యవహారంలో మా సన్నిహితుల పేర్లు బయటకు తీసుకొచ్చి, వాళ్ల ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారు. ఓ మహిళగా, మరో మహిళ ప్రతిష్టను దెబ్బతీసేలా వస్తున్న అబద్ధాల్ని ఖండిస్తున్నాను.”
భర్తతో తను విడిపోవడానికి మూడో వ్యక్తి కారణం కాదని స్పష్టంచేసింది దియామీర్జా. కేవలం తమ వ్యక్తిగత కారణాల వల్లనే విడిపోయామని తెలిపింది. ఇకనైనా పుకార్లు ఆపాలని, తమ వ్యక్తిగతానికి మీడియా గౌరవం ఇవ్వాలని కోరుకుంటోంది.
“సాహిల్, నేను విడిపోవడానికి మూడో వ్యక్తి కారణం కాదు. మా ఇద్దరి విడాకుల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం లేదని కచ్చితంగా చెప్పగలను. మీడియా కాస్త సంయమనం పాటించి, మా వ్యక్తిగతానికి విలువ ఇస్తుందని భావిస్తున్నాను. నా అభిప్రాయాల్ని మీడియా గౌరవిస్తుందని భావిస్తున్నాను.”
దియామీర్జా ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చినప్పటికీ సదరు పుకార్లు మాత్రం బాలీవుడ్ లో ఆగడంలేదు. నిప్పులేనిదే పొగరాదంటారు. ఈ మేటర్ కూడా అలాంటిదే అనుకోవాలేమో. మరోవైపు ప్రకాష్ కోవెలమూడి-కనిక వైవాహిక బంధం కూడా సజావుగా సాగడం లేదనే వార్తలు, ఈ మొత్తం వ్యవహారానికి మరింత ఊతమిస్తున్నాయి.