హీరోయిన్ సురభి తెలుగులో తక్కువ సినిమాలే చేసినా, గుర్తించుకోతగ్గ పాత్రలే చేశారు. ‘జెంటిల్మెన్', ‘ఒక్కక్షణం’ సినిమాలు సురభికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తెలుగులో మంచి కథల కోసం ఎదురు చూస్తుండడంతో ఒక్క క్షణం తర్వాత బాగా గ్యాప్ వచ్చిందన్నారు. అయితే తెలుగులో నటించేందుకు కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ, తన పాత్రకు ప్రాధాన్యం లేకపోవడంతో అంగీకరించలేదని తెలిపారామె.
ఇకపై ఎక్కువ విరామం తీసుకోకుండా సినిమాలు చేయాలని బలంగా నిశ్చయించుకున్నట్టు సురభి తెలిపారు. ‘ఎక్స్ప్రెస్ రాజా’, ‘జెంటిల్మన్' చిత్రాలతో కథానాయికగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన సురభి జన్మదినం నేడు (జూన్ 5). ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు ఆమె వెల్లడించారు. ఆ విశేషాలేంటంటే…
కుటుంబసభ్యుల సమక్షంలో ఇంట్లోనే పుట్టిన రోజు వేడుక చేసుకోబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ముంబయిలో తుఫానుతో పాటు లాక్డౌన్ కొనసాగుతోందన్నారు. అందువల్లే ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఈ పుట్టినరోజును జరుపు కోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సురభి తెలిపారు. బర్త్డే కోసం తనే స్వయంగా కేక్ తయారు చేయబోతున్నట్టు తెలిపారు. పానీ పూరి, వడపావ్ తయారు చేయడం నేర్చుకున్నానని, తన వంట చేయడం చూసి అమ్మ ఆశ్చర్యపోయిందని సంతోషంగా చెప్పుకొచ్చారామె.
లాక్డౌన్ ప్రకటించే సమయంలో తాను హైదరాబాద్లో ‘శశి’ సినిమా షూటింగ్లో ఉన్నట్టు తెలిపారు ఇంకో వారంలో సినిమా షూటింగ్ ముగుస్తుందనగా లాక్డౌన్ ప్రకటించారన్నారు. లాక్డౌన్ విరామంలో కుటుంబం విలువ తెలసుకున్నట్టు సురభి వెల్లడించారు. అన్నిటికంటే దయాగుణాన్ని కలిగి ఉండటం ముఖ్యమని తెలుసుకున్నానన్నారు. ‘శశి’ సినిమాలో కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే అమ్మాయిగా కనిపించనున్నట్టు ఆమె తెలిపారు. ఒక పాట తప్ప మిగిలిన సినిమా చిత్రీకరణ అంతా పూర్తయిందన్నారు.
‘జెంటిల్మెన్', ‘ఒక్కక్షణం’ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టినా తెలుగులో అవకాశాలు ఎందుకు రావడం లేదో తనకు తెలియదని నవ్వుతూ చెప్పుకొచ్చారామె. ఆ విషయాన్ని టాలీవుడ్ దర్శకులనే అడగాలని ఉచిత సలహా ఇచ్చారు. కెరీర్ పరంగా ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. సినిమాల సంఖ్య పరంగా తక్కువే చేసినప్పటికీ, మంచి సినిమాల్లో నటించాననే సంతృప్తి మిగిలిందన్నారు.
అయితే పాత్రల పరంగా మున్ముందు ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నట్టు అందాల తార సురభి తన మనసులో మాటను బయటికి చెప్పారు. మరి ఎలాంటి ప్రయోగాలు చేస్తారో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.