తెలంగాణా మంత్రులు ఎందుకో పక్క రాష్ట్రమైన ఏపీ మీద పడ్డారు. అంటే ఏపీపై విమర్శలు చేస్తున్నారని అర్ధం. ఇదంతా రాష్ట్రంలోని సమస్యల నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికేనని విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు కేసీఆర్ సర్కారు మీద విరుచుకుపడుతున్నాయి. ఆంధ్రా మంత్రులు కూడా తెలంగాణా మంత్రుల మీద విమర్శలు చేస్తున్నారనుకోండి.
తెలంగాణా మంత్రులు చేస్తున్న విమర్శల్లో కొంత వాస్తవం ఉన్నా ఎందుకు ఇంతగా విమర్శలు చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మొదలైన ఈ వార్ మరింత ముదిరితే ఏపీ ఎన్నికలపైనా ప్రభావం పడుతుందని రాజకీయ పండితులు అంటున్నారు.
అంటే ఏపీ ఎన్నికలను తెలంగాణా మంత్రులు ప్రభావితం చేస్తారనుకోవాలా? దీని వెనుక కేసీఆర్ వ్యూహం ఉందా అనే అనుమానం కలుగుతోందని కొందరు నాయకులు అంటున్నారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో టీడీపీకి వ్యతిరేకంగా జగన్ కు మద్దతివ్వడం మొదలుపెట్టిన కేసీఆర్.. ఆ తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని కొనసాగించారు. అప్పట్లో సీఎంలు కేసీఆర్, జగన్ ఇద్దరూ పలుమార్లు భేటీలు కావడం, ఇరు రాష్ట్రాలకు సంబంధించి మూడో వ్యక్తితో సంబంధం లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటామని ప్రకటనలు చేయడం చూశాం.
ఆ తర్వాత రాయలసీమ లిఫ్ట్ దగ్గర మొదలైన వివాదం వీరిద్దరి మధ్య దూరం అమాంతం పెంచేసింది. దీని ప్రభావం ఈ ఏడాదిలో అంతగా కనిపించకపోయినా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ తెరపైకి వస్తోందని అంటున్నారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రులు ఏపీతో పలు విషయాల్లో రాష్ట్రాన్ని పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ఉచిత విద్యుత్ మోటర్లకు మీటర్ల వ్యవహారం, టీచర్లతో వైసీపీ సర్కార్ వివాదాలు వంటి సున్నిత అంశాల్ని తెరపైకి తెస్తున్నారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, మరో సన్నిహితుడు ప్రశాంత్ రెడ్డి వంటి వారు ఈ వ్యాఖ్యలు చేస్తుండటంతో ఇది టీఆర్ఎస్ బాస్ పనేనన్న ప్రచారం జరుగుతోంది.
గతంలో 2019 ఎన్నికల సందర్భంగా అప్పటి సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ పలుమార్లు ప్రకటించి అనుకున్నట్లుగానే ఆయన్ను గద్దెదింపడంలో సక్సెస్ అయిన కేసీఆర్.. ఈసారి వైసీపీ అధినేత, సీఎం జగన్ కు ఆ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా అన్న చర్చ సాగుతోంది.
ఇప్పటికే ప్రాజెక్టుల విషయంలో ఏపీతో నెలకొన్న విభేదాలు, పోలవరం ముంపు, విభజన వివాదాల్ని కేంద్రంగా చేసుకుని ఏపీ సర్కార్ ను కేసీఆర్ టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వైసీపీ సర్కార్ ఏపీలో ఉద్యోగులు, ఇతర వర్గాలతో వ్యవహరిస్తున్న తీరును కూడా తెలంగాణలో అదే వర్గాలకు గుర్తుచేస్తూ కేసీఆర్ రాజకీయాన్ని రగిల్చే పనిలో ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.