ఒక‌టిన ఏపీ అవ‌త‌ర‌ణ దినాన్ని….!

అక్టోబ‌ర్ ఒక‌టిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని నిర్వ‌హించాల‌ని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక డిమాండ్ చేస్తోంది. ఈ మేర‌కు ఆ సంఘం క‌న్వీన‌ర్ బొజ్జా దశరథ రామిరెడ్డి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల…

అక్టోబ‌ర్ ఒక‌టిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని నిర్వ‌హించాల‌ని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక డిమాండ్ చేస్తోంది. ఈ మేర‌కు ఆ సంఘం క‌న్వీన‌ర్ బొజ్జా దశరథ రామిరెడ్డి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అక్టోబ‌ర్ ఒక‌టిన నిర్వ‌హించ‌డం స‌బ‌బ‌ని ఆయ‌న తెలిపారు. దానికి గ‌ల చారిత్ర‌క నేప‌థ్యాన్ని ఆయ‌న వివ‌రించారు.

రాయ‌ల‌సీమ హ‌క్కుల ప‌త్రం శ్రీ‌బాగ్ ఒడంబ‌డిక స్ఫూర్తితో ఉమ్మ‌డి మ‌ద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి  1953, అక్టోబ‌ర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్ప‌డింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ క‌ల‌వ‌డంతో 1956, న‌వంబ‌ర్ 1న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డింద‌ని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచి 2014, జూన్ 2న తెలంగాణ విడిపోయి, ప్ర‌స్తుతం ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డింద‌ని తెలిపారు. అయితే ఈ రాష్ట్రం నాడు 1953లో ఏర్ప‌డిన రాష్ట్ర‌మ‌నే సంగ‌తిని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని అక్టోబ‌ర్ 1నే నిర్వ‌హించాల‌ని గ‌త‌, ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికి అనేక విజ్ఞాప‌న ప‌త్రాలు అందజేసినా, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేసినా ప‌ట్టించుకోలేద‌ని వాపోయారు. శ్రీబాగ్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆ చారిత్రక అంశం ప్రజలకు గుర్తుకు రాకుండా గత ప్రభుత్వం జూన్ 2 న, ప్రస్తుత ప్రభుత్వం నవంబర్ 1 న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తోంద‌ని పేర్కొన్నారు.  

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పాటులో  శ్రీబాగ్ ఒడంబడిక ప్రాధాన్యత తదితర చ‌రిత్రాత్మక అంశాలు గుర్తుచేసి, ప్రజా చైతన్యం కలిగించి, పాలకులపై ఒత్తిడి పెంచి రాయలసీమ అభివృద్ధి సాధించాల‌న్న ల‌క్ష్యంగా రాయలసీమ ప్రజా సంఘాలు అక్టోబర్ 1 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వహిస్తున్నాయ‌ని ద‌శ‌ర‌థ‌రామిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది కూడా ఆ సంప్ర‌దాయాన్ని కొన‌సాగించ‌నున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు.