అవినీతికి యాప్ – చేప‌ల వేట క‌థ‌

అవినీతిని అరిక‌ట్టాల‌ని యాప్‌ని రూపొందించ‌డం మంచి ప‌ని. అయితే మూలం ఎక్క‌డుంద‌ని ఆలోచిస్తే చిన్న‌ప్పుడు చ‌దివిన చేపాచేపా ఎందుకు ఎండ‌లేదు అనే క‌థ గుర్తుకొస్తుంది. కీల‌కమైన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో అవినీతి త‌గ్గ‌కుండా, అధికార వ్య‌వ‌స్థ‌లో…

అవినీతిని అరిక‌ట్టాల‌ని యాప్‌ని రూపొందించ‌డం మంచి ప‌ని. అయితే మూలం ఎక్క‌డుంద‌ని ఆలోచిస్తే చిన్న‌ప్పుడు చ‌దివిన చేపాచేపా ఎందుకు ఎండ‌లేదు అనే క‌థ గుర్తుకొస్తుంది. కీల‌కమైన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో అవినీతి త‌గ్గ‌కుండా, అధికార వ్య‌వ‌స్థ‌లో త‌గ్గ‌డం అసంభ‌వం. ఎందుకంటే అన్నింటిని ప్ర‌భావితం చేసేది రాజ‌కీయ‌మే కాబ‌ట్టి.

రేపు ఎన్నిక‌లొస్తున్నాయి. ఓటుకి 1000 నుంచి 2000 వ‌ర‌కు ఇవ్వాలి. అంటే క‌నీసం ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో 40 నుంచి 70 కోట్లు పంచాలి. ఎమ్మెల్యేలు ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త ప‌డుతున్నారు. స్థానికంగా జ‌రిగే సెటిల్‌మెంట్స్‌, ఇసుక దందాలు ప్ర‌శాంతంగా జ‌రిగిపోతున్నాయి. ఇవ‌న్నీ అధికారుల సాయం లేకుండా జ‌ర‌గ‌వు. మ‌రి ఈ అధికారులు యాప్‌ల‌కి భ‌య‌ప‌డ‌తారా?

సొసైటీలో మెయిన్‌గా రెవెన్యూ, పోలీస్‌, ర‌వాణా, రిజిస్ట్రేష‌న్, ప‌న్నుల శాఖ‌లు అవినీతితో ఉన్నాయి. ఇత‌ర శాఖ‌ల్లో లేద‌ని కాదు, సామాన్యులు ఎక్కువ తిరిగేది ఈ ఆఫీసుల చుట్టే. డ‌బ్బులు లేకుండా ఈ శాఖ‌ల్లో ప‌నులు చేయించుకోవ‌డం అసాధ్యం.

ఈ మ‌ధ్య ఒక మిత్రుడు రెవెన్యూ ఆఫీస్‌కు వెళ్లాడు. స‌ర్వ‌ర్ డౌన్ అన్నారు. రెండో రోజు వెళితే ఎమ్మార్వో లేడు. మూడో రోజు వెళితే స‌ర్వ‌ర్ డౌన్‌. నాలుగో రోజు ఒక ద‌ళారి వ‌చ్చి రూ.5 వేలు ఇస్తే తిర‌గాల్సిన అవ‌స‌రం లేకుండా ప‌ని జ‌రుగుతుందన్నాడు. ఇత‌నికి లంచం ఇవ్వ‌డం ఇష్టం లేదు. కానీ సెల‌వు పెట్టుకుని ఎన్నిరోజులు తిర‌గ‌గ‌ల‌డు? ఒక‌వేళ అత‌ను యాప్‌లో ఫిర్యాదు చేయాలంటే ఎవ‌రి మీద చేయాలి? ద‌ళారి మీదా?

పోలీసుల గురించి అంద‌రికీ తెలుసు. వాళ్ల‌కి వ‌చ్చే జీతాలెంత‌? రిటైర్ అయిన‌పుడు వాళ్ల ఆస్తులెంత‌? లెక్క‌లు తీస్తే అవినీతి విశ్వ‌రూపం తెలుస్తుంది. ప్ర‌తి స్టేష‌న్‌కి ఒక లెక్క వుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కి రాయ‌ల‌సీమ‌లో అత్యంత ఆదాయం వ‌చ్చే స్టేష‌న్ల‌లో తిరుప‌తి ఈస్ట్ ఒక‌టి. ఈ పోస్టింగ్ విలువ రూ.30 ల‌క్ష‌లపైనే. ప్ల‌స్ గ‌ట్టి రెక‌మెండేష‌న్. డ‌బ్బులు ఇచ్చుకోలేని ఎస్ఐలు మారుమూల స్టేష‌న్ల‌లో మ‌గ్గిపోతారు. వాళ్ల‌కిపుడు వైన్ షాపుల ఆదాయం కూడా లేదు. ఇదే తిరుప‌తిలో యూనివ‌ర్సిటీ స్టేష‌న్ వుంది. ఈ పోస్టుకి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. చాకిరీ త‌ప్ప ఆదాయం లేని స్టేష‌న్‌.

తిరుప‌తి ఈస్ట్‌కి ఇంత ఆదాయం ఎందుకంటే హోట‌ళ్లు, బార్లు, లాడ్జీలు అన్నీ దీని ప‌రిధిలోనే. నెల‌వారీ మామూళ్లు వ‌సూళ్లు చేయ‌డానికే ఇద్ద‌రు కానిస్టేబుళ్లున్నారు. వాళ్ల‌ని క‌లెక్ట‌ర్లు అంటారు. మామూళ్లే కాదు, వీళ్ల‌కున్న చాకిరీ కూడా త‌క్కువేం కాదు. తిరుప‌తికి వ‌చ్చే అధికారుల‌కి రాచ‌మ‌ర్యాద‌లు చేయాలి. వాళ్ల కుటుంబాల‌కి వెహిక‌ల్స్ అరేంజ్ చేసి కాళ‌హ‌స్తి, కాణిపాకం తిప్పాలి. కొండ‌పైన ద‌ర్శ‌నం బాధ్య‌త తిరుమ‌ల పోలీసుల‌ది. మ‌ర్యాద‌ల ఖ‌ర్చు త‌ట్టుకోడానికి కొండ‌పైన వున్న వ్యాపారుల నుంచి వాళ్లు వ‌సూలు చేస్తారు. ఇదంతా అంద‌రికీ తెలిసిన ర‌హ‌స్య‌మే.  

ఇంకో జోక్ ఏమంటే పోలీసుల్లో బాగా తిన‌మ‌రిగిన వాళ్ల‌ని అవినీతి నిరోధ‌క‌శాఖ‌లో వేస్తారు. A.C.B అంటే ప్ర‌త్యేక సంస్థ కాదు. పోలీసుల్లో ఒక విభాగ‌మే. వీళ్లు టార్గెట్ కోసం కొంద‌రు బ‌క‌రాల‌ని ప‌ట్టుకుంటూ వుంటారు.

ఇక ర‌వాణాశాఖ మంత్రి అయినా స‌రే మారువేషంలో వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ కోసం Tryచేస్తే ఆ శాఖ‌లో వున్న ఏజెంట్ల వ్య‌వ‌స్థ అర్థ‌మ‌వుతుంది. రిజిస్ట్రేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.

శేషాచ‌లం కొండ‌ల్లో 40 ఏళ్ల నుంచి ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ జ‌రుగుతోంది. కూలీల్ని అరెస్ట్ చేశారు. ఎన్‌కౌంట‌ర్ కూడా చేశారు. డాన్‌ల‌ని అరెస్ట్ చేశారు. వాళ్లు బెయిల్ మీద వ‌చ్చి మ‌ళ్లీ స్మ‌గ్లింగ్ చేశారు. మ‌రి నాలుగు ద‌శాబ్దాలుగా పోలీస్‌, ఫారెస్ట్ అండ‌లేకుండా స్మ‌గ్లింగ్ జ‌రిగిందా? చిత్తూరు జిల్లాలో ప‌నిచేసిన ఫారెస్ట్ అధికారుల ఆస్తుల లెక్క ఎంత‌? వాళ్ల‌లో ఎంద‌రు అరెస్ట్ అయ్యారు?

ఇదంతా ఒక వ‌ల‌యం. ప్ర‌యాణం స్టార్ట్ చేస్తే మ‌ళ్లీ బ‌య‌ల్దేరిన చోటికి వ‌స్తాం. అయినా ఇపుడు ఫోన్‌ల‌లో మాట్లాడి లంచాలు ఫిక్స్ చేసుకునే అమాయ‌కులు ఎవ‌రున్నారు? నోరు విప్పితే రికార్డు చేస్తార‌ని ప‌ల్లె ప్ర‌జ‌ల‌కి కూడా తెలుసు, ఇక అధికారుల‌కి తెలియ‌దా? అయితే ఎక్క‌డో ఒక చోట ప్ర‌యత్నం మొద‌ల‌వ్వాలి. ఆ ర‌కంగా ఇది శుభ‌ప‌రిణామ‌మే. క‌నీసం కొంచెం భ‌య‌మైనా వుంటుంది!

జీఆర్ మ‌హ‌ర్షి