ఏపీ కాంగ్రెస్ లో సంస్థాగత మార్పులు చేయడానికి పూనుకున్నారట రాహుల్ గాంధీ. ఇంతకీ రాహుల్ గాంధీ ఏ హోదాలో ఆ మార్పులకు పూనుకుంటున్నారో మరి! రాహుల్ గాంధీ ఏఐసీసీకి మాజీ అధ్యక్షుడు మాత్రమే. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ.
రాహుల్ మళ్లీ ఏఐసీసీ బాధ్యతలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాహుల్ ఆ బాధ్యతలే కాదు.. కనీసం లోక్ సభ వరకూ అధ్యక్ష బాధ్యతలు తీసుకోమని ఆ పార్టీ నేతలంటున్నా.. ఆయన పట్టించుకోవడం లేదు. అయితే ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, ఇతర ఏపీ కాంగ్రెస్ నేతలు వెళ్లి రాహుల్ తో సమావేశం అయ్యారట. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ లో సంస్థాగత మార్పులు ఉంటాయని రాహుల్ చెప్పారట!
ఇదీ కాంగ్రెస్ కామెడీ. అసలు మార్చడానికి అక్కడ ఏముంది? అనేది ప్రశ్నార్థకం. ఒకప్పుడు వీధికో కాంగ్రెస్ నేత ఉండే వాడు. ఇప్పుడు రాష్ట్రం మొత్తానికీ నాలుగైదు పేర్లున్నాయి. వారిలో కూడా ఎవరూ ప్రజల్లో ఎప్పుడూ కనిపించరు. కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ, పల్లంరాజు, చింతా మోహన్.. వీళ్లే రాహుల్ తో వెళ్లి సమావేశం అయ్యారట. మరి మిస్ అయ్యిందెవరయ్యా అంటే.. తులసి రెడ్డి కాబోలు. ఇదీ ఏపీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ జంబో లీడర్లు.
తులసిరెడ్డి లాంటి వాళ్లకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ ను టీడీపీకి తోక పార్టీ గా కాకుండా, ఈక పార్టీగా మార్చేందుకు సర్వదా రెడీగా ఉంటారు. జగన్ తమ పార్టీ ఓటు బ్యాంకును ఎమోషనల్ సెంటిమెంట్ తో తన వైపుకు తిప్పుకున్నాడంటూ వాపోయారట శైలజానాథ్. మరి ఎమోషనల్ సెంటిమెంట్ అయితే అది ఏడాదో రెండేళ్లో ఉండొచ్చు.
జగన్ పార్టీ పెట్టి ఇప్పటికే దశాబ్దం గడిచిపోయింది. తమ నాయకత్వ పటిమ ఏమిటో ఒప్పుకోకుండా.. జనాలను సెంటిమెంటల్ ఫెలోస్ గా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ నేతలు ఎవరిని మోసం చేస్తున్నారో వేరే చెప్పనక్కర్లేదు.
మొత్తానికి ఎలాగైతేనేం.. ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి త్వరలోనే పలువురిని ఢిల్లీకి పిలిపించుకుంటారట రాహుల్ గాంధీ. మరి ఈ విషయంలో చంద్రబాబు సలహాలు స్వీకరించడం మంచిదేమో! రాహుల్ ఆ ఆహ్వానాన్ని చంద్రబాబుకు పంపించడం మేలేమో!