ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారంటూ చాన్నాళ్లుగా కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. 2024 వరకు ఉన్న అధికారాన్ని మధ్యలోనే వదులుకుని సీఎం జగన్.. ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని.. పాపం, ఆశావహులు సుమారు ఏడాదినుంచి తమకు తోచిన ప్రచారం చేసుకుంటూ బతుకుతున్నారు.
తెలుగుదేశం పార్టీ కట్టు తప్పిపోకుండా.. పార్టీ శ్రేణులు జావగారి పోకుండా.. ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చు ముందస్తు ఎన్నికలు తథ్యం అనే మాటలతో చంద్రబాబునాయుడు రోజులు నెట్టుకొస్తున్నారు. అయితే ఇలాంటి అందరూ.. తమ తమ ఊహాగానాలను అటక మీద పెట్టుకోవాల్సిందే. ఇలాంటి ఊహలతో బతికేవాళ్లందరికీ జగన్ ఒకేసారి చెక్ పెట్టేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిల సమావేశంలో ఆయన మాటల అంతరార్థాన్ని గమనిస్తే ముందస్తు ఎన్నికల గురించిన ఆలోచన లేదని అర్థమవుతోంది.
ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో జగన్ సమావేశం నిర్వహించారు. 27 మంది ఎమ్మెల్యేలని చాలా సీరియస్ గా హెచ్చరించారు. గడప గడపకు కార్యక్రమాన్ని సీరియస్ గా పట్టించుకోని వారికే అక్షింతలు పడ్డాయి.
ప్రజల్లో ప్రభుత్వం ప్రతిష్ఠ పెరగడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అందరూ నమ్ముతున్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వం ఏం మేలు చేసిందో ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికీ వెళ్లి తెలియజెప్పే కార్యక్రమం ఇది. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కలుగుతోంది. తమకు కష్టాలుంటే ఎమ్మెల్యేలతో స్వయంగా చెప్పుకోగలుగుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు చాలా సీరియస్ గా ఈ కార్యక్రమం తమ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ జరిగిన రోజుల్లో కూడా మద్యలో శని, ఆదివారాలు ఖాళీ వస్తే చాలు.. నియోజకవర్గానికి వెళ్లిపోయి.. పాల్గొన్నవారు ఉన్నారు. కాగా, కొందరు మొక్కుబడిగా సాగిస్తున్నారు. అలాంటి అందరి గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్న జగన్.. 27 మందిని సీరియస్ గా హెచ్చరించడం విశేషం.
అయితే ఈ సమావేశంలో జగన్ మాటల్లోని అంతరార్థాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఈసారి ఎన్నికలను ఇంకా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాం అని.. ఎన్నికలకు కనీసం ఆరునెలల ముందుగానే అందరు అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికి ఎన్నికలకు సుమారుగా పద్దెనిమిది నెలల దూరం ఉంది. అయితే, గడపగడపకు కార్యక్రమం ఎలా జరుగుతోందో.. నవంబరులో మళ్లీ ఓసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి హెచ్చరించారు.ఆ రకంగా గడపగడపకు హెచ్చరికలతో ఈ ఏడాది గడచిపోయినట్టే.
జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే.. ఆరునెలల ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తానన్న ఆయన మాట ప్రకారం.. 2023 తొలి మూడు నెలల్లోనే జరగాలి. నిజానికి వచ్చే ఏడాది ప్రారంభంలో నారా లోకేష్ పాదయాత్రను, పవన్ కల్యాణ్ బస్సు యాత్రను ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో గనుక జగన్ అభ్యర్థుల జాబితాను ప్రకటించినా, ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. తమకు దక్కగల ప్రజాదరణ చూసి జడుసుకుని ముందస్తు ఎన్నికలకు వచ్చేశారని వారిద్దరూ ప్రగల్భాలు పలికే అవకాశం ఎక్కువ.
జగన్మోహన్ రెడ్డి నైజం ప్రకారం తన ప్రత్యర్థులకు అలాంటి మాటలు పలికే అవకాశం ఇవ్వరు. ఆ కోణంలోంచి చూసినప్పుడు.. ఏపీలో ముందస్తు ఎన్నికలు అనేవి వచ్చే అవకాశమే లేదని అర్థమవుతుంది. ఆ ఊహలు ప్రచారం చేసుకుంటూ మనుగడ సాగించేవాళ్లంతా ఇక ఆశ వదలుకోవాల్సిందే.