అఖిల్ తో పాటు పలు తమిళ సినిమాల్లో నటించిన నటి సయేషా సైగల్ పుట్టిన రోజు ఈ రోజు. ఇటీవలే తల్లి అయిన సయేషాకు ఒకవైపు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఆమె భర్త, నటుడు ఆర్య నిన్న పోలీసుల ముందు హాజరు కావడం గురించి చర్చ కొనసాగుతూ ఉంది.
దాదాపు నెల రోజుల కిందట ఆర్యపై తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఒక ఫిర్యాదు వచ్చిందట. అది జర్మనీలో ఉన్న ఒక శ్రీలంకన్ యువతి నుంచి. ఆర్య తనను మోసం చేశాడంటూ ఆమె సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానంటూ ఆర్య హామీ ఇచ్చాడని, తనతో 70 లక్షల రూపాయల డబ్బు కూడా తీసుకున్నాడంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నదట. ఈ అంశంపై ప్రశ్నించడానికి ఆర్యను పోలీసులు పిలిచారు. దాదాపు మూడు గంటల సేపు ఆర్యను అధికారులు విచారించినట్టుగా సమాచారం.
తమిళ సెలబ్రిటీల విషయంలో ఇలాంటి కంప్లైంట్లు కొత్తవి కాదు. ఫలానా సెలబ్రిటీ తన భర్త అని, ఇంకో హీరోయిన్ తన భార్య అని కూడా అక్కడ కంప్లైట్లు పడుతుంటాయి. ఫలానా హీరోయిన్ తన పిల్లలకు తల్లి అని, ఇంకో ప్రముఖురాలని తను కొడుకును, కూతురిని అంటూ కూడా అక్కడ కోర్టుల్లో పిటిషన్లు పడుతూ ఉంటాయి.
హీరో ధనుష్ తమ కొడుకు అంటూ ఒక జంట దాఖలు చేసిన పిటిషన్ సంవత్సరాలకు సంవత్సరాల పాటు విచారణకు నోచుకున్న నేపథ్యం ఉంది తమిళనాడుకు. ఇలాంటి నేపథ్యంలో ఆర్యపై దాఖలైన ఫిర్యాదు ఎలాంటిదనేది ఆసక్తిదాయకంగా మారింది.
ఈ విషయమై ఆర్య పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, ఆమె ఎవరో కూడా తనకు తెలియదు అని! ఆమె ఎవరో తనకు తెలియదని ఆర్య కుండబద్దలు కొట్టాడట. అయితే ఆమె మాత్రం ఆర్య తనతో చాట్ చేసిన స్క్రీన్ షాట్లను కూడా పోలీసులకు పంపిందట. మరి ఆమె నిజంగానే మోసపోయిందా, లేక కేవలం ప్రచారం కోసం ఇలాంటి పనికి పూనుకుందా.. అనేది ఆసక్తిదాయకమైన అంశం.
ఒకవేళ ఆర్య పేరుతో సోషల్ మీడియాలో మరెవరైనా చాట్ చేసి ఆమెతో ఏకంగా 70 లక్షలకు టెండర్ పెట్టి ఉన్నా ఆశ్చర్యం లేదు. అయితే జర్మనీ వరకూ వెళ్లిన ఒక శ్రీలంకన్ యువతి.. ఇలా తమిళ హీరోపై అకారణంగా ఫిర్యాదు చేస్తుందా అనేదీ సందేహాస్పదమైన అంశమే! మొత్తానికి ఈ ఫిర్యాదుతో ఆర్య పూర్తి స్థాయి విచారణను ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడినట్టుగా ఉంది!