2024లో 175/175 సీట్ల గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలతో ఇవాళ సీఎం జగన్ నేతృత్వాన జరిగిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీరుపై సీఎం సమీక్షించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ప్రతీ గడపకు సమయం కేటాయించాల్సిందేనని, పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సూచించారు.
గడప గడపకు కార్యక్రమంలో కొందరు సరైన పనితీరు కనపరచలేదని, పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టాలని సదరు ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 27 మంది ఎమ్మెల్యేలు చురుకుగా లేరంటూ మండిపడ్డారు.
నేతలు పనితీరు మార్చుకోకుంటే ఈ సారి సీటు ఇచ్చేది లేదని, నవంబరులో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు రివ్యూ చేస్తామని అప్పటికైనా పనితీరు మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. వారంలో 4 రోజులు జనంలోనే ఉండాలని సీఎం ఎమ్మెల్యేలకు సూచించారు. నేతలు వెళ్లకుండా.. కొడుకులు లేదా వారసులకు పంపడం కుదరదని ఆ నేతలే స్వయంగా వెళ్లి ప్రజలను కలవాలన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175 175 టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్ రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రలకు మాత్రమే సీట్లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అందుకోసమే ఎన్నో వడపోతల తర్వాత ఎన్నికలకు ఆరు నెలలకు ముందే అభ్యర్ధులకు సీట్లు కేటాయించి ఎన్నికల యుద్ధం రంగంలోకి దిగబోతున్నారు.