దేశంలో సంచలనంగా మారిన వలస కార్మికుల కష్టాల గురించి కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా స్పందించారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడానికి తమ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లనూ చేసిందని షా అంటున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాట్లు చేసేంత వరకూ వేచి ఉండలేక చాలా మంది కార్మికులు కాలి నడకన సొంత ఊళ్లకు చేరుకునే ప్రయత్నం చేశారని, వాళ్లకు ఓపిక లేకే నడక మొదలుపెట్టారని.. ఆయన చెప్పడం గమనార్హం!
కొన్ని లక్షల మంది వలస కార్మికులను రైళ్ల ద్వారా, బస్సుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సొంతూళ్లకు చేర్చిందని షా చెప్పారు. దీనికి 11 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టుగా ఈ కేంద్రమంత్రి ప్రకటించడం గమనార్హం! బస్సుల ద్వారా 45 లక్షల మందిని, రైళ్ల ద్వారా 55 లక్షల మంది వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చినట్టుగా షా గణాంకాలను చెప్పారు.
ఉన్న ఫలంగా లాక్ డౌన్ విధించడం, వలస కార్మికులను పట్టించుకోకపోవడంపై మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల అన్నీ ఉన్న వాళ్లకు పెద్ద ఇబ్బంది కలగకపోవచ్చు. అయితే పనుల కోసం పొట్ట చేత పట్టుకుని వెళ్లిన వారికి అటు ఉపాధీ లేక, సొంతూళ్లకు వెళ్లిపోవడానికి అవకాశమూ లేక నానా ఇబ్బందులు పడ్డారు. దేశంలో వలస కూలీల సంఖ్య కోట్లలో ఉంది. ఈ నేపథ్యంలో వారి గురించి ఏ మాత్రం ఆలోచించలేదని మోడీ సర్కారుపై విమర్శలు వచ్చాయి.
ఆ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వలస కార్మికుల గురించి మాట్లాడే వాళ్లు కావాలంటే నడిచి వెళ్లే కార్మికుల బ్యాగులను మోయాలంటూ ఆమె వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ప్రభుత్వం ఏర్పాట్లు చేసేంత వరకూ వలస కార్మికులు ఓపిక పట్టాల్సిందని అమిత్ షా ఇప్పుడు అంటున్నారు. లాక్ డౌన్ విధించింది మార్చిలో, ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను మే ఒకటి నుంచి నడపడం మొదలుపెట్టింది.