తమ తండ్రులకు మచ్చ తేవడంలో నందమూరి బాలకృష్ణ, వైఎస్ షర్మిల శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇది జనాభిప్రాయం. సొంత వాళ్లూ వీళ్ల వ్యవహారాల్ని మెచ్చుకోలేని దుస్థితి. తన తండ్రి యుగపురుషుడని, మహోన్నత వ్యక్తి అని, అవతార పురుషుడని బాలయ్య పలు సందర్భాల్లో ఆకాశమే హద్దుగా పొగిడారు. అయితే షర్మిల పంథా కొంచెం భిన్నం. పదేపదే తాను రాజన్న బిడ్డనని, వైఎస్సార్ రక్తాన్ని అని, పులిబిడ్డనని, మహా నాయకుడని చెబుతూ వుంటారు. తండ్రిపై ప్రేమ చాటుకోడాన్ని ఎవరూ తప్పు పట్టరు.
అయితే ఇతర నాయకులను పోల్చుతూ కించపరిచేలా మాట్లాడ్డంపైనే అభ్యంతరం. కాకపోతే బాలయ్య కంటే వైఎస్సార్ పిల్లలు కాస్త నయం. తండ్రికి వెన్నుపోటు పొడిచారనే చెడ్డ పేరు లేదు. వైఎస్సార్ కూతురు కాదని షర్మిలను ఎవరన్నారు? పులిబిడ్డ, వైఎస్సార్ రక్తాన్ని అని పదేపదే చెప్పుకోవాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలంటే వైఎస్సార్, ఎన్టీఆర్ రక్తాన్ని పంచుకుని పుట్టిన వాళ్లేనా? మరెవరూ కాదా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వైఎస్సార్ బిడ్డవు కాబట్టే జనం కనీసం చూడడానికి వస్తున్నారు. వైఎస్సార్ ముద్దుల తనయ కాకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకుంటారు?
మంచోచెడో తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పేరుతో తెలుగు సమాజం రెండు రాష్ట్రాలుగా ఏర్పడింది. తెలంగాణలో సెంటిమెంట్, ఆత్మాభిమానం రాజకీయాలు నడుస్తున్నాయి. అక్కడ ఆంధ్రా నాయకులకు చోటు లేదన్నది వాస్తవం. 2018 ఎన్నికల్లో చంద్రబాబు అతి తెలివితేటలతో తలదూర్చి, కేసీఆర్‌కు రెండోసారి అధికారం దక్కేలా చేశారు. చంద్రబాబు కంటే జగన్ రాజకీయంగా తెలివైన వాడు కాబట్టే తెలంగాణ రాజకీయాల నుంచి తప్పుకుని పరువు నిలుపుకున్నారు.
షర్మిల ధైర్యమో, అజ్ఞానమో తెలియదు కానీ రోడ్ల వెంట అలుపెరగకుండా తిరుగుతున్నారు. అది ఆమె ఓపిక. కాదనే వాళ్లెవరూ లేరు. కానీ జగ్గారెడ్డి లాంటి వాళ్లతో తండ్రిని పోల్చి చెప్పడం వల్ల వైఎస్సార్ ప్రతిష్ట పెంచినట్టా? తగ్గించినట్టా? జగన్ ఎప్పుడైనా తన తండ్రిని ఇలా బజారుపాలు చేశారా? వైఎస్ జగన్ తండ్రి దివంగత వైఎస్సార్ అనేలా జగన్ నడుచుకుంటున్నారు. తండ్రి పేరు వాడకంలో అన్న నుంచి షర్మిల ఏం నేర్చుకుంటున్నట్టు?
షర్మిలను జగ్గారెడ్డి హెచ్చరించడంలో తప్పులేదు. తనను వార్న్ చేయడానికి జగ్గారెడ్డి ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం జగ్గారెడ్డిపై నోరు పారేసుకున్నప్పుడు షర్మిలకు గుర్తు రాలేదా? జగ్గారెడ్డికి సంస్కారం ఉండడం వల్లే, మరోసారి తనపై అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరికతో వదిలేశారు. షర్మిల రాజకీయ విమర్శల తీరు చూస్తుంటే, చివరికి వైఎస్సార్‌ను తెలంగాణలో ప్రతి ఒక్కరితో తిట్టించేలా చేస్తుందనే అనుమానం కలుగుతోంది.
షర్మిలకు పోయేదేమీ లేదు. పోతేగీతే ఆమె తండ్రి వైఎస్సార్ పరువే. షర్మిల తీరు ఎలా వుందంటే… కొండకు వెంట్రుక ముడి వేస్తే, వస్తే కొండ, పోతే వెంట్రుకే అనే విమర్శ లేకపోలేదు. జగ్గారెడ్డితోనే కాదు, మున్ముందు మరెవరితోనైనా తండ్రిని పోల్చి గొప్పలు చెప్పుకునే క్రమంలో వైఎస్సార్ పరువు తీయడానికి షర్మిల వెనుకాడరనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇంతకంటే షర్మిలకు మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు. తెలంగాణలో షర్మిల రాజకీయం గమ్యం లేని ప్రయాణం కావడం వల్లే ఈ అవస్థ.
తండ్రికి తగ్గ తనయ షర్మిల అని పేరు తెచ్చుకునేలా ఎదిగితే లోకం అభినందిస్తుంది. అలా కాకుండా తండ్రి పేరు చెప్పుకుంటూ ఎంతకాలమని రాజకీయం చేస్తారో షర్మిలకు తెలియాలి.
బాలకృష్ణ కూడా తమ బ్లడ్, బ్రీడ్ వేరని చెబుతూ, ఎన్టీఆర్ పరువు కాస్త పోగొడుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, వైఎస్సార్ దివంగతులయ్యారు. వారి గురించి లోకం మంచిగా మాట్లాడుకోవాలి. అలా కాకుండా వాళ్ల పేర్లతో కుటుంబ సభ్యులు సొమ్ము చేసుకోవాలని భావిస్తే సీన్ రివర్స్ అవుతుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై నిరసన వ్యక్తం చేసే క్రమంలో తన తండ్రి పెద్ద తోపు అని, వైఎస్సార్‌ను అందుకు భిన్నంగా చూపుతూ బాలకృష్ణ వ్యవహరించడాన్ని సమాజం ఛీత్కరించింది.
ఎన్టీఆర్, వైఎస్సార్‌లపై గౌరవం, ప్రేమ ఒక పరిధి వరకే వుంటుంది. వారిని సొంత ప్రయోజనాలకు వాడుకోవాలని వారసులు చూస్తున్నారనుకుంటే మాత్రం… రివర్స్ అవుతుందని చెప్పడానికి షర్మిల, బాలకృష్ణ వ్యవహారాలే నిదర్శనం. తండ్రుల వారసత్వం మాత్రమే కాదు, జవసత్వాలు ముఖ్యం. అవి ఎంత మాత్రం ఉన్నాయో ఆలోచించే తెలివితేటలే వుంటే… షర్మిల, బాలయ్య తమ తండ్రులను అభాసుపాలు చేయాలని అనుకోరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.