కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఇచ్చిన తన బర్త్ డే పార్టీకి ఏపీ పార్టీ నేతలు కూడా హాజరయ్యాయరని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలు కపిల్ సిబల్ పుట్టిన రోజు పార్టీకి హాజరయినట్టుగా ఆ కథనాల్లో పేర్కొంటున్నారు.
ఈ పార్టీకి మొత్తం 23 పార్టీల నేతలు హాజరయినట్టుగా సమాచారం. వాటిల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. ఆ పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు కొందరు ఈ పార్టీకి హాజరయ్యాయరట. శశిథరూర్, మనీష్ తివారీ, పి.చిదంబరం తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారట. కాంగ్రెస్ తీరు మార్పు రావాలని బాహాటంగానే ప్రకటిస్తున్నారు కపిల్ సిబల్. ఈ విషయంలో ఆయనకు కొంతమంది సీనియర్ల మద్దతు ఉంది. గులాంనబీ ఆజాద్ తో సహా అనేక మంది నేతలు కపిల్ తో శృతి కలుపుతున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం తీరులో మాత్రం పెద్దగా మార్పు లేదు.
ఈ క్రమంలో కపిల్ ఈ పార్టీని హోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి ప్రత్యామ్నాయశక్తిగా ఏర్పడటంలో సోనియా, రాహుల్ లకు ఏ మేరకు ఆసక్తి ఉందో కానీ, కపిల్ సిబల్ కు మాత్రం ఈ విషయంలో చాలా శ్రద్ధ ఉందనే ఉద్దేశం ఈ పార్టీ తో స్పష్టం అవుతోంది. తమ పార్టీ అధిష్టానం వద్ద ఈ విషయంలో ఎంత చెప్పినా, అది చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే భావనకు వచ్చినట్టుగా ఉన్నారు కపిల్. అందుకే ఎన్డీయేతర పార్టీలన్నింటినీ ఆయన ఆహ్వానించినట్టుగా ఉన్నారు.
ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నేతలు హాజరయ్యారట. మరి జాతీయ స్థాయిలో ఇప్పటి వరకూ బీజేపీపై ఏ విషయంలోనూ అంత గట్టిగా వ్యతిరేక వాణిని వినిపించని ఈ పార్టీల వాళ్లు కపిల్ పార్టీకి హాజరు కావడం విశేషమే. అయితే ఈ పార్టీలో సోనియా, రాహుల్ ల నీడ పడదనే విషయం గ్రహించే వారు కపిల్ ఆతిథ్యాన్ని స్వీకరించి ఉండవచ్చు. అంతేనా.. ఇంతకు మించి ఏమైనా ఉంటుందా?