రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కామెడీ ఎక్సట్రా జబర్దస్త్‌ను మించిపోయింది. హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చిన తర్వాత ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు. సహజంగా న్యాయస్థానంలో తీర్పు అనుకూలంగా వచ్చి నప్పుడు ఎవరికైనా ఆనందం కలుగుతుంది. ఆ విజయానందం నిమ్మగడ్డలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ కనబరుస్తున్న అత్యుత్సాహం విమర్శలకు దారి తీస్తోంది.
తనకు వెంటనే హైదరాబాద్‌కు వాహనాలు పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించడం, ఎన్నికల సంఘానికి సంబంధించి లాయర్‌ను రాజీనామా చేయాలని ఆదేశించడం తదితర వ్యవహారాలు ఆయన అత్యుత్సాహానికి, విపరీత ధోరణులకు నిదర్శనం గా చెప్పుకోవచ్చు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటన కూడా అభ్యంతరకరంగా ఉంది. ఆయన ప్రకటనలో ఏం ఉందంటే…
“రాష్ట్ర ప్రభుత్వ వైఖరి హైకోర్టు తీర్పును ఉల్లంఘించేదిగా ఉంది. 2021 మార్చి 31వరకు ఎస్ఈసీగా నేను కొనసాగేలా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్ఈసీగా కొనసాగే హక్కు నాకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం మే 30న మీడియా సమావేశం నిర్వహించి పలు కారణాలు చూపుతూ కోర్టు ఉత్తర్వులను అమలు చేసే ఉద్దేశం లేదనడం సమర్థనీయం కాదు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి, సమగ్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం అగౌరవాన్ని కొనసాగించడం దురదృష్టకరం. హైకోర్టు తీర్పుతో జస్టిస్ కనగరాజు ఎస్ఈసీగా కొనసాగే హక్కులేదు. రాజ్యాంగబద్ధ ఎస్ఈసీ పదవి ఖాళీగా ఉంచడానికి వీల్లేదు”…. ఇదీ నిమ్మగడ్డ వాదన.
హక్కులు విజేతలకే కాదు పరాజితులకు కూడా ఉంటాయని సహజ న్యాయసూత్రాలు చెబుతున్నాయి. మరి ఈ విషయాన్ని నిమ్మగడ్డ దాస్తూ…తనకు అనుకూలమైన వాదన మాత్రమే తెరపైకి తెస్తున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించే కనీస హక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? ఇది కూడా హైకోర్టు తీర్పు ఉల్లంఘించినట్టేనా? నాణేనికి బొమ్మ, బొరుసు ఉంటాయి. ఎస్ ఈసీగా నిమ్మగడ్డను పునర్నియమిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం బొమ్మ అయితే, న్యాయం కోసం దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయిస్తుండడం బొరుసు అవుతుంది.
ఈ విషయం తెలిసి కూడా హైకోర్టు తీర్పే ఫైనల్ అయినట్టు నిమ్మగడ్డ రాద్ధాంతం చేయడం దేనికి సంకేతం? తనకు తానుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించుకోవడం నిమ్మగడ్డ దృష్టిలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి, సమగ్రత పట్ల గౌరవాన్ని, హూందాతనాన్ని ప్రదర్శించడం అవుతుందా? సుప్రీంకోర్టు ఏం చెబుతుందో వినడానికి నిమ్మగడ్డకు ఓపిక లేదా? ఈ లోపు అక్కడ చేరిపోయి ఏం చేయాలనుకుంటున్నారు? చంద్రబాబు రాజ్యాంగాన్ని అమలు చేయాలనే పట్టుదలతో ఉన్నారా? ఇప్పటికైనా నిమ్మగడ్డ కాస్త జబర్దస్త్ కామెడీ చేయడం మాని సంయమనం పాటిస్తే గౌరవాన్ని కాపాడుకున్న వారవుతారు.
-సొదుం