ఎమ్బీయస్: జగన్ ఏడాది పాలన

సాధారణ జనాల్లో ఎన్నో ఆశలు రేకెత్తించి జగన్ అధికారంలోకి వచ్చాడు అని అనడం కన్నా చంద్రబాబుతో విసిగిన జనాలు అతన్ని అధికారంలోకి తెచ్చారు అనడం సబబుగా తోస్తుంది నాకు. జగన్‌కు పాలనానుభవం లేదు, కనీసం…

సాధారణ జనాల్లో ఎన్నో ఆశలు రేకెత్తించి జగన్ అధికారంలోకి వచ్చాడు అని అనడం కన్నా చంద్రబాబుతో విసిగిన జనాలు అతన్ని అధికారంలోకి తెచ్చారు అనడం సబబుగా తోస్తుంది నాకు. జగన్‌కు పాలనానుభవం లేదు, కనీసం మంత్రిగా కూడా చేయలేదు. పైగా అవినీతిపరుడు, ఫ్యాక్షనిస్టు మనస్తత్వం, విపరీతమైన క్రైస్తవాభిమాని, దాష్టీకం వలన తన అనుచరులను నిలుపుకోలేడు.. అనే ముద్ర కూడా వుంది. మానిఫెస్టోలో వరాలు గుప్పించడం అన్ని పార్టీలూ చేసే పనే. అవి చూసే జనం నమ్మేశారనుకోవడం కష్టం. రాజశేఖరరెడ్డి కొడుకు కాబట్టి నమ్మారు అనడానికీ లేదు. ఎవరికి వారే. బాబును చూసి లోకేశ్‌కు ఓట్లేస్తారా? ఒక్కసారి ఛాన్సివ్వండి అని అడిగేవాళ్లు చాలామంది వుంటారు. అలా అడిగినంత మాత్రాన యిచ్చేసేటంత ఉదారులు ఎవరూ లేరు.

బాబు డాబులకు పోకుండా, సింగపూరు సాయంతో సమస్తం ప్రభుత్వమే కట్టేస్తుందనే కబుర్లు మాని, అమరావతిలో కొన్ని ప్రభుత్వభవనాలు కట్టి, చుట్టూ ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించి కొంత యాక్టివిటీ మొదలుపెట్టి వుంటే, కమ్మవారికే మొత్తమంతా దోచిపెడుతున్నాడన్న పేరు రాకుండా చూసుకుని వుంటే, పై నుంచి కిందదాకా పాకిన అవినీతిని అదుపులో వుంచగలిగి వుంటే జగన్‌కు ఛాన్స్ వచ్చేది కాదు. రాజకీయంగా చేసిన పొరపాట్ల గురించి యిక్కడ ప్రస్తావించటం లేదు. పథకాల పేర ఎంత డబ్బు పంచినా ప్రజలు సంతోషించలేదు. టిడిపి చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోరంగా ఓడించారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టిడిపి మళ్లీ గెలుస్తుందా అని ఆలోచిస్తే నెగ్గలేదనే సమాధానం వస్తుంది. అదే జగన్ పాలనకు గీటురాయి.

తన అనుభవరాహిత్యంతో, దూకుడు స్వభావంతో జగన్ అధ్వాన్నంగా పాలిస్తూ వుంటే యితని కంటె బాబే బెటర్రా బాబూ అనుకునేవారు జనాలు. కానీ టిడిపి బలపడటం లేదు. 2019 ఎన్నికలలో 39 శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ నానాటికి బలహీనపడి, దాని నుంచి నాయకులు జారుకుంటున్నారు. ఉన్నవాళ్లలో సగం మంది స్తబ్దంగా వుంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలలో టిడిపి నాయకులు ఉత్సాహంగా లేరు. దీనికి రాజధాని విషయంలో జగన్ వేసిన ఎత్తుగడ కొంతవరకే కారణం కావచ్చు. ఏడాది తర్వాత కూడా జగన్‌పై జనాలకు యింకా విరక్తి కలగలేదు. స్థానిక ఎన్నికలు ఎప్పడు జరిగినా ఆ విషయం నిరూపితమౌతుంది. అధికార పార్టీ దాదాగిరీ, అధికార దుర్వినియోగం, విపరీతమైన సంక్షేమ పథకాలు.. యిలా మీడియా, టిడిపి ఎన్నయినా కారణాలు చెప్పవచ్చు. కానీ జనాలలో విపక్షం పుంజుకోలేకపోయిందనేది వాస్తవం.

ఒక్కమాట మాత్రం ఒప్పుకోవాలి – మానిఫెస్టోని యింత సీరియస్‌గా తీసుకుని, వచ్చిన ఏడాదిలోనే యిన్ని హామీలు నెరవేర్చడానికి ప్రయత్నించిన రాజకీయ నాయకుడు నాకు గుర్తున్నంతవరకు ఎవరూ లేరు. చాలామంది మొదట్లో కొన్ని తలపెట్టి, తమ పలుకుబడి తగ్గిందని తోచినప్పుడల్లా ఒక్కోటి ప్రవేశపెడుతూ, ఎన్నికల సంవత్సరంలో చాలా భాగం మొదలుపెట్టి.. యిలా ఐదేళ్లూ లాగించేస్తారు. వీటివలన వచ్చే గుడ్‌విల్ యావత్తూ మొదటి ఏడాదిలోనే ఖర్చు పెట్టాలని చూడరు. కానీ జగన్ పద్ధతే వేరుగా వుంది. ప్రజలు నిలదీసి అడిగేలోపునే చేసేస్తున్నాడు. వీటి వలన పడే ఆర్థికభారాన్ని ఎలా నిభాయించుకువస్తాడో యిప్పటికీ తేలటం లేదు. అవతల కేంద్ర సహాయమూ అంతంతమాత్రంగానే, బాబు హయాంలో వున్నట్టుగానే వుంది. కానీ జీతాలు యివ్వలేని పరిస్థితి యిప్పటిదాకా రాలేదు. గత హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా తొక్కిపెట్టడం వలన కొంత కలిసి వచ్చి వుండవచ్చు.

పథకాల అమలులో అవినీతి, పార్టీ పరంగా పక్షపాతం పెద్దగా వున్నట్లు తోచటం లేదు. ఏ మాత్రం ఉన్నా యీపాటికి ప్రతిపక్షాలు ఏకి పారేసేవి. ఊరికే జె-టాక్స్, జె-టాక్స్ అంటున్నారు తప్ప ఆధారాలు చేజిక్కించుకుని కోర్టుకి వెళ్లటం లేదు. ప్రభుత్వవిధానాల పరంగా తుమ్మినా, దగ్గినా కోర్టుకు పరిగెత్తే టిడిపి వారు యీ విషయంలో కోర్టుకి వెళ్లకపోవడం వలననే యీ అభిప్రాయం కలుగుతోంది. పాలకులు మారినంత మాత్రాన అధికారగణం మారిపోరు. క్షేత్రస్థాయిలో ఎంతోకొంత తప్పకుండా వుండే వుంటుంది. కానీ బాబు హయాంతో పోలిస్తే భరించదగినదానిగానే వుందేమో, తెలియదు. లంచాలు అడిగితే పట్టించుకోరు కానీ పీడిస్తే మాత్రం మండిపడతారు. ఆ స్టేజికి యింకా రాలేదేమో.

ఇక క్రైస్తవాభిమాని అని పేరు తుడుపుకోవడానికి జగన్ విపరీతంగా శ్రమిస్తున్నాడు. పీఠాధిపతులకు ప్రాధాన్యత యిస్తున్నాడు. అయినా దాన్ని హైలైట్ చేయడానికి ప్రతిపక్షాలు చాలా కష్టపడుతున్నాయి. కాపులను అక్కున చేర్చుకుని, బిసి, దళిత, మైనారిటీలకు పెద్దపీట వేస్తున్నా అంటే, అదిగో ఆ పేరుమీద క్రైస్తవులకే అన్నీ చేస్తున్నాడు అంటున్నారు. ఇక హింసా రాజకీయాలకు వస్తే గతంతో పోలిస్తే చాలా తక్కువగా వుంది. వ్యక్తులపరంగా కొట్లాటలు నడుస్తున్నాయి తప్ప రాజకీయపరంగా జరుగుతున్నట్లు లేదు. అయినా బాబు అండ్ కో ‘రాయలసీమ సంస్కృతి‘, ‘పులివెందుల పంచాయితీ‘, ‘ఫ్యాక్షనిస్టు విపరీతబుద్ధి‘ వంటి పదాలు వాడడం మానలేదు. దీనివలన ఆ ప్రాంతవాసుల మనసు ఎంత కష్టపెడుతున్నామో వారికి అర్థం కావటం లేదు.

పాలనానుభవం లేని కారణంగా జగన్ చాలా పొరపాట్లు చేస్తాడని అనుకున్నవారిని ఆశ్చర్యపరిచేట్లా జగన్ పాలన సాగుతోంది. అతని రాజకీయపు టెత్తుగడలు కూడా టిడిపిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజధాని వికేంద్రీకరణ అంశం టిడిపి ప్రభావాన్ని ఒక ప్రాంతానికి, ఒక కులానికి పరిమితం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం నిర్బంధం చేసే అంశంలో కోర్టు ఆదేశాల మేరకు యిప్పుడు చేసిన సర్వే, బిల్లు ప్రవేశపెట్టేందుకు ముందే చేసి వుంటే యింత రగడ వుండేది కాదు. కానీ దీనివలన టిడిపి 96 శాతం పేద తలితండ్రుల అభిమతానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిందని తేటతెల్లమై పోయి, వారు తెల్లమొహం వేయవలసిన పరిస్థితి కల్పించింది. మద్యం విషయంలో కూడా టిడిపి విపరీత వాదనలు చేస్తున్నట్లు తటస్థులకూ తోస్తోంది.

మొత్తం మీద జగన్ పాలన చూస్తే ఎన్టీయార్ తొలి టర్మ్ పాలన గుర్తురాక మానదు. జగన్  లాగానే ఆయనకూ పాలనానుభవం లేదు. ప్రజలకు ఏదో చేసేయాలన్న తపన. అభివృద్ధి కార్యకలాపాలు, దీర్ఘకాలిక ప్రణాళికల కంటె తక్షణావసరాలు తీర్చే సంక్షేమ పథకాలపైన దృష్టి. బాబు పాలనలో జరిగిన ప్రతి పనిని, అప్పుడు సమర్థుడిగా పేరు తెచ్చుకున్న ప్రతి అధికారిని అనుమాన దృక్కులతో ఇప్పుడు జగన్ చూసినట్లే, అప్పుడు ఎన్టీయార్ కాంగ్రెసుకు సంబంధించిన ప్రతి పనిని, ప్రతి అధికారిని అనుమానంగా చూసేవారు. ఇప్పటిలాగానే అప్పుడూ జీతాలు ఆపివేయడం, హఠాత్తుగా బదిలీ చేయడం, సస్పెండ్ చేయడం, వాళ్లు కోర్టుల కెళితే కోర్టు చేత మొట్టికాయలు తినడం.. అంతా సేమ్ టు సేమ్.

జగన్ ఎన్నికల కమిషనర్ రమేశ్ పదవీకాలాన్ని తగ్గించి ఆయన స్థానంలో వేరే వాళ్లని తెస్తే నానా యాగీ అవుతోంది. 1983లో ఎన్టీయార్ అవినీతి పర్యవేక్షణకై ధర్మమహామాత్రను నియమించినపుడు అప్పటి విజిలన్స్ కమిషనర్ పదవీకాలాన్ని తగ్గించి యింటికి పంపేశారు. ఇలాటి పనులు చేసినపుడు కాంగ్రెసు విమర్శలు గుప్పించేది. కానీ ఎన్టీయార్ పట్టించుకోలేదు. ఎన్టీయార్‌తో పోలిస్తే, జగన్‌కు ఎల్వీ సుబ్రహ్మణ్యంతో వచ్చిన పేచీ అతి చిన్నది. తన మొదటి టర్మ్‌లో ఎన్టీయార్ ముగ్గురు చీఫ్ సెక్రటరీలను మార్చారు. ఇక ప్రభుత్వోద్యోగులతో అయితే నిత్యఘర్షణ. వాళ్లను పందికొక్కులని తిట్టేవారు, నేను యముణ్ని, మీ తోలుతీస్తా అనేవారు. 37 వేల మంది మునసబు, కరణాలను ఒక్క కలంపోటుతో యిళ్లకు పంపి, వారి స్థానంలో కేవలం 4500 మంది విలేజి అసిస్టెంటులను నియమించారు. (కనీసం 10 వేల మంది కావాలని అఫీషియల్ నోట్ చెప్పింది). దాంతో రికార్డుల వ్యవస్థ అంతా గందరగోళమై పోయింది.

ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును 58నుంచి 55కి తగ్గించి అన్ని స్థాయిల ఉద్యోగుల ఆగ్రహాన్ని, అనుమానాలను మూటకట్టుకున్నారు. చివరకు కోర్టు ఆదేశాల మేరకు వాళ్లకు ఉత్తిపుణ్యాన మూడేళ్ల జీతం యివ్వాల్సి వచ్చింది. తను తప్ప తక్కినందరూ అవినీతిపరులే అనే ధోరణిలో ఎన్టీయార్ వుండేవారు. తన పాలనను ప్రజలకు అందించవలసిన పనిముట్లయిన అధికార యంత్రాంగంతో అనునిత్యం పోరాడుతూండేవారు. జగన్‌కు ఆ పోలిక రాలేదు. ఆపత్సమయాలలో అధికారులు బాగా పని చేస్తున్నారంటూ కితాబులు యిచ్చి ప్రోత్సహిస్తున్నాడు. మనం, మనం అంటూ మాట్లాడుతున్నాడు. బాబు హయాంలో చివాట్లు తినితిని మొహం వాచిపోయిన బ్యూరాక్రసీకి యిది రిలీఫ్‌గా వుంది. ఆయనెప్పూడూ “నేనే చేశా“ అంటూండేవాడు. ఎన్టీయార్ రోజుల్లో కేంద్రంతో పేచీ నిత్యవ్యవహారంగా వుండేది. ఇప్పుడా గొడవ లేదు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షంగా వుండి నిత్యం బెదిరించేది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ రాష్ట్రంలో నామమాత్రంగా వుండి ప్రకటనలకే పరిమితమౌతోంది. ప్రధాన ప్రతిపక్షానికి కేంద్రంలో పలుకుబడి లేదు.

చిత్తశుద్ధి వున్నా ఎన్టీయార్ అత్యుత్సాహంతో ఎన్నో తప్పులు చేశారు. అప్పట్లో ఎదురులేని మీడియాగా, ప్రజాభిప్రాయాన్ని పోతపోసే శక్తి వున్న “ఈనాడు” ఎన్టీయార్‌ను సుతిమెత్తగానే మందలిస్తూ ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పైనే ప్రధానంగా అస్త్రాలు ఎక్కుపెట్టేది. ఎన్టీయార్‌ను కాదనుకుంటే దిక్కులేదనే అభిప్రాయాన్ని కలిగించేది. ఇప్పుడు మీడియా జగన్‌కు ప్రత్యామ్నాయంగా బాబు వున్నారని చూపుతోంది, జగన్‌కు వ్యతిరేకంగా తిరగబడమని జనాలను రెచ్చగొడుతోంది. సోషల్ మీడియా రాతలు సరేసరి. ఇలాటి పరిస్థితుల్లో కూడా జగన్ యీ మాత్రం నెగ్గుకు రాగలుగుతున్నాడు, ఎందుకంటే అతనికి సొంత మీడియా వుంది, సోషల్ మీడియాలో అనుయాయులున్నారు.

జగన్ నెలకొల్పిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అతనికి చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. ముఖ్యంగా కరోనాను ఎదుర్కునే విషయంలో అది ఎంతో అక్కరకు వచ్చింది. ఎల్‌జీ దుర్ఘటన విషయంలో కూడా జగన్ కనీవిని ఎరుగనంత పరిహారం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పాలన విషయంలో జగన్ చాలా విషయాల్లో మెరుగనిపించినా, రాజకీయపరంగా మాత్రం సంయమనం లోపిస్తోంది. తన మాటకు ఎవరూ అడ్డు రాకూడదన్న ధోరణి కనబడుతోంది. వైసిపి, టిడిపి రెండూ హుందాతనం మరచి, డిఎంకె, ఎడిఎంకెల్లా నిరంతరం కత్తులు దూసుకుంటున్నాయి. ఒకరినొకరు గుర్తించుకోవడానికి నిరాకరిస్తున్నాయి. ప్రతిపక్షం కూడా గట్టిగా, సమర్థవంతంగా వున్నపుడే ప్రభుత్వపాలన మెరుగౌతుంది. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పరచి అందరి సలహాలు తీసుకోవడమనేది బాబు హయాంలోనూ జరగలేదు, యిప్పుడు జగన్ హయాంలోనూ జరగటం లేదు.

అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటే జగన్ ఏడాది పాలన సవ్యంగానే సాగిందని తోస్తుంది.  అలవికాని సంక్షేమ పథకాలతో రాష్ట్రం ఎలా నడుస్తుందా అని జనాలకు ఉన్న చింత జగన్‌కు ఉన్నట్టు లేదు. కరోనా కారణంగా ఆర్థికస్థితి దెబ్బతిన్న యీ తరుణంలోనైనా రాజధాని తరలింపు వంటి అనవసర విషయాలను వదులుతాడో లేదో తెలియదు, పరిశ్రమలు ఎలా వస్తాయో తెలియదు. ఒకటి మాత్రం ఒప్పుకోవాలి. వినియోగదారుల చేతులకు డబ్బు అందించకపోతే, ఎన్ని ఋణాలు యిచ్చినా పరిశ్రమలు కుదేలవడం ఖాయం అని ఆర్థికవేత్తలందరూ చెపుతున్నారు. ఆంధ్రలో మాత్రం సంక్షేమ పథకాల కారణంగా సామాన్యులకు డబ్బు అందుతోంది. అందువలన అక్కడి వ్యాపారాలు, పరిశ్రమలు గట్టున పడి నిరుద్యోగిత మరీ అంత పెరగకపోవచ్చు. 

ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2020)