కరోనా వైరస్ పై భారతదేశం విజయపథంలోకి సాగుతోందని అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ మేరకు ఆయన ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. రెండో టర్మ్ లో తన ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో మోడీ ప్రజలకు ఒక లేఖ రాశారు. అందులో కరోనా వైరస్ వ్యాప్తి అంశాన్ని కాస్త ప్రస్తావించారు మోడీ.
ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. కరోనాపై భారత్ విజయపథంలోకి సాగుతోందన్నారు. ఈ తీరు మిగతా ప్రపంచాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. కరోనాపై భారతీయులు సమష్టిగా పోరాడుతున్నారని మోడీ అన్నారు. కరోనా లాక్ డౌన్ ఫలితంగా వలస కూలీలు, చేతి వృత్తుల వాళ్లు, శ్రామికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని మోడీ పేర్కొన్నారు.
అయితే వలస కూలీల గురించి మోడీ ఇప్పుడు ఆలోచించడానికన్నా ..లాక్ డౌన్ ను ప్రకటించే సమయంలోనే ఆలోచించాల్సిందేమో. ఇప్పటిలాగా మొదట్లోనే వారికి ట్రావెల్ ఏర్పాట్లను చేసి, అప్పుడే వారికి సరిగ్గా పరీక్షలు నిర్వహించి ఉంటే వలస కూలీలకు ఇన్ని కష్టాలు ఉండేవి కావు. కరోనా మరణాలతో పోలిస్తే లాక్ డౌన్ వల్ల వలస కూలీల కష్టాలే పెద్ద వ్యథ అని స్పష్టం అవుతోంది. ఈ విషయంలో ఇప్పుడు చింతించడానికన్నా , ముందే కాస్త ఆలోచించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు.
ఇక దేశంలో ఇప్పుడు దినవారీగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆరు వేల స్థాయి నుంచి రోజువారీ కేసుల సంఖ్య ఏడు వేలకు పెరిగిందిప్పుడు. రివకరీ రేటు 40 శాతానికి పైనే ఉన్నా.. అసలు సవాల్ ఇప్పుడే మొదలవుతోందని స్పష్టం అవుతోంది. లాక్ డౌన్ మినహాయింపుల నేపథ్యంలో ఇక నుంచినే కరోనా అసలు ప్రభావం ఏమిటో తేలుతుందని పరిశీలకులు అంటున్నారు. అయితే ప్రధాని మాత్రం ఇండియా విజయపథంలోకి సాగుతోందని చెబుతున్నారు.