జయలలిత మరణించి దాదాపు నాలుగో సంవత్సరం గడుస్తోంది. అయితే ఆమె ఆస్తుల వ్యవహారం మాత్రం ఇప్పటి వరకూ ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయంలో తమిళనాడు హై కోర్టు భిన్నరకాల తీర్పులు ఇవ్వడం గమనార్హం. పోస్ గార్డెన్ లోని జయలలిత ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఇటీవలే హై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రజలకు ఉపయోగపడేలా ఆ భవనాన్ని వాడుకోవచ్చన్నట్టుగా తీర్పును ఇచ్చింది. అయితే ఇంతలో జయలలిత ఆస్తులకు ఆమె మేనల్లుడు, మేనకోడలు వారసులంటూ అదే కోర్టు నుంచి తీర్పు రావడం గమనార్హం!
దీంతో కథ మొత్తం మలుపు తిరిగినట్టే. తను బతికి ఉన్న రోజుల్లో తన వారసులుగా ఎవరినీ గుర్తించలేదు జయలలిత. దత్తపుత్రుడిని కలిగినా ఆ తర్వాత అతడినీ దూరం పెట్టేసింది. వారసత్వంగా ఎవరికీ ఆస్తులను రాసి వెళ్లలేదు. అలాగే తన మేనల్లుడు, మేనకోడలును కూడా జయలలిత ఎన్నడూ దగ్గర తీసుకున్న దాఖలాలు లేవు. జయ ఉన్న రోజుల్లో వారు కూడా ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చే ప్రయత్నాలు కూడా చేయలేదు. అంతలా జయలలిత వారిని దూరం పెట్టారు.
అయితే ఇప్పుడు అనూహ్యంగా జయలలిత ఆస్తులకు ఆమె మేనకోడలు దీప, ఆమె మేనల్లుడు దీపక్ లను వారసులుగా నిర్ధారించిందట కోర్టు. ఈ తీర్పుతో వారు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. బహుశా ఇలాంటి తీర్పును వారు కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదేమో!
ఈ తీర్పుతో వారికి వేల కోట్ల రూపాయల ఆస్తులు దక్కవచ్చని అంచనా. కోర్టులో జయలలిత ఆస్తులపై జరిగిన వాదోపవాదాల్లోనే ఆ ఆస్తుల విలువ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలట! అదంతా డాక్యుమెంటెడ్ విలువ మాత్రమే. అదే మార్కెట్ వ్యాల్యూ విషయానికి ఆ వెయ్యి కోట్ల రూపాయల మొత్తానికి అనేక రెట్లు ఎక్కువ మొత్తం విలువ ఉండొచ్చు జయలలిత ఆస్తులు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుతో దీప, దీపక్ లు రాత్రికి రాత్రి వేల కోట్ల రూపాయల ఆస్తులను పొందబోతున్నట్టుగా ఉన్నారు.
అయితే జయలలిత ఆస్తులు మరిన్ని ఉండొచ్చని అంచనా. వాటి గుట్టు శశికళ వద్ద ఉండొచ్చనే అభిప్రాయాలున్నాయి. జయ, శశి ల ఉమ్మడి ఆస్తులుగానూ కొన్ని వేల కోట్ల రూపాయల సంపద ఉండొచ్చనే అభిప్రాయాలున్నాయి. కొడనాడులో ఒక టీ ఎస్టేట్ ఉందట.. అది ఏకంగా రెండు వేల ఎకరాల్లో విస్తరించి ఉందట. ప్రస్తుతం అదంతా శశికళ ఆధ్వర్యంలోనే ఉందని సమాచారం. అక్కడ ఎకరా విలువ కోటి రూపాయల పైనే అని అంచనా. అది జయలలిత, శశికళ ఉమ్మడి ఆస్తి అనే అంటున్నారు. అయితే శశికళ మాత్రం ఆ ఎస్టేట్ అంతా తనదే అని అంటోందట. అయితే డాక్యుమెంట్స్ లో ఏం రాసుకున్నారో బయటపడే అవకాశం ఉంది. జయలలిత ఆస్తులకు చట్టబద్ధంగా దీప, దీపక్ లను వారసులుగా కోర్టు ప్రకటించిన నేపథ్యంలో.. వారు జయలలిత ఆస్తులన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చి, స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశాలు లేకపోలేదు!