క్లారిటీ ముందే ఉండాలిగా సీఎం గారూ..!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా చాలా పథకాలు పురుడుపోసుకున్నాయి, వీటిలో కొన్ని పట్టాలెక్కాయి. అయితే ఈ పథకాలపై ప్రజల్లో కాస్త క్లారిటీ మిస్సవుతోందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. తాజాగా రైతు భరోసా పథకంపై…

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా చాలా పథకాలు పురుడుపోసుకున్నాయి, వీటిలో కొన్ని పట్టాలెక్కాయి. అయితే ఈ పథకాలపై ప్రజల్లో కాస్త క్లారిటీ మిస్సవుతోందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. తాజాగా రైతు భరోసా పథకంపై అసెంబ్లీలో జరిగిన రగడే దీనికి నిదర్శనం. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకీ పంటకాలం ప్రారంభానికి ముందే ఏడాదికి 12,500 రూపాయలు చెల్లిస్తుంది. దీనికోసం బడ్జెట్ లో కేటాయింపులు కూడా జరిగాయి.

అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏడాదికి ప్రతి రైతుకీ 6వేల రూపాయలు ఇస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అదనమా, దాన్ని కూడా 12,500 రూపాయల్లో కలుపుతారా అనేదే ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు ఆర్థికమంత్రి బుగ్గన అసెంబ్లీలో తెలివిగా సమాధానం చెప్పారు. గతంలో నీరు-చెట్టు లాంటి పథకాలకు కేంద్ర పథకాలను జతచేసి నిధులు వాడుకున్నారు కదా, ఇప్పుడు మేం చేస్తే తప్పేంటి అని ప్రతిపక్షం నోరు మూయించారు.

టీడీపీ సంగతి పక్కన పెడితే సామాన్య రైతులకు మాత్రం ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో, ఎవరో ఆందోళన చేస్తే సర్దిచెప్పడం కాదు, ముందే స్పష్టత ఇచ్చేస్తే అసలు ఏ గొడవా ఉండదు. ఇటీవల రేషన్ డీలర్ల విషయంలో కూడా ఇదే జరిగింది. దాదాపు 20 రోజుల పాటు తమ ఉపాధి కోసం డీలర్లు ఆందోళనకు దిగారు. గ్రామ వాలంటీర్లతో తమకు ఇబ్బంది వస్తుందేమోనని మనసు కష్టపెట్టుకున్నారు. పోనీ టీడీపీ ప్రోద్బలంతోనే ఇది జరిగింది అనుకుందాం. గ్రామ వాలంటీర్ల ప్రకటన విడుదల చేసినరోజే డీలర్లకు వీరితో సమస్యలేదు అని ప్రకటిస్తే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు కదా.

నూతన ఇసుక విధానంపై కూడా ప్రభుత్వం ఇంత తాత్సారం ఎందుకు చేస్తోందో అర్థం కావడంలేదు. నిబంధనలు ముందే చెప్పేసినా కొత్త విధానం కోసం సెప్టెంబర్ 1 వరకు వేచిచూడాల్సిన పరిస్థితి. ఈలోపు నిర్మాణదారులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇక ఆశా కార్యకర్తలు కూడా తమ జీతాల విషయంలో క్లారిటీ లేక రోడ్లెక్కారు. నెలరోజుల తర్వాత కానీ వీరికి ఓ సమాధానం చెప్పి కుదుటపరిచారు మంత్రివర్యులు.

ప్రస్తుతం 108 సిబ్బంది నిరసనలు కొనసాగుతున్నాయి. వీరిలో ఏ ఒక్కరికీ జగన్ అన్యాయం చేయరని అందరికీ తెలుసు, సీఎం నిర్ణయం అందరికీ అనుకూలంగానే ఉంటుందనీ తెలుసు. కానీ ఆ నిర్ణయం రావడం ఆలస్యమౌతోంది. ఆందోళనలకు అవకాశం ఇస్తోంది. వీటిని కట్టిపెట్టాలంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుని మంత్రులే ఆయావర్గాలకు ప్రభుత్వ పథకాలపై పూర్తి వివరణ ఇస్తే బాగుంటుంది. ఇదే జరిగితే ఇక రోడ్డెక్కేవారు ఉండరు, విమర్శల చేయడానికి ప్రతిపక్షానికీ అవకాశం ఉండదు.

ఫిల్మ్ నగర్ అయిపోయే.. ఇప్పుడు వయా ముంబై

ఎవరిది పిచ్చోడి చేతిలో రాయి పాలన అవుతుంది!