ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజూ వేల సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. రోజూ కనీసం 8వేలకు తగ్గకుండా పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో మరో 9858 శాంపిల్స్ ను పరీక్షించిన అధికారులు.. కొత్తగా 54 కేసులు నమోదైనట్టు ప్రకటించారు.
కొత్తగా నమోదైన 54 కేసుల్లో.. నెల్లురూ నుంచి ఇద్దరు, గుంటూరు-చిత్తూరు నుంచి చెరొకరికి కోయంబేడు కనెక్షన్ ఉన్నట్టు అధికారులు నిర్థారించారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2841కు చేరింది.
ఇక కోలుకున్నవారి విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో మరో 45 మంది కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ఏపీలో డిశ్చార్జీల సంఖ్య 1958కు చేరింది. అటు కరోనా కారణంగా కర్నూలులో ఒక వ్యక్తి మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 59కు చేరింది. ప్రస్తుతం 824 కరోనా పేషెంట్లకు వివిధ హాస్పిటల్స్ లో చికిత్స కొనసాగుతోంది.
మరోవైపు రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లను మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూనే, మరిన్ని మినహాయింపులిస్తోంది ప్రభుత్వం. అయితే చాలా ప్రాంతాల్లో బస్సుల్లో ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. కనీసం బస్టాండ్స్ లో టిక్కెట్ కౌంటర్ల వద్ద కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు.