'పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోవడానికి కారణమేవరు? దర్శకుడు బోయపాటి శ్రీనును అక్కడ షూటింగ్ చేయమని ఎవరు చెప్పారు? బోయపాటిని చంద్రబాబు నాయుడు షూటింగ్ చేయమన్నారా లేక బోయపాటినే సినిమా షూటింగ్ చేశారా అనేది టీడీపీ సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఎందుకు సామాన్య ఘాట్లో పుష్కరస్నానం చేయాల్సి వచ్చింది? అంత పెద్ద ఘటన జరిగిన కూడా కనీసం ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు.
మరణించిన ఇరవై తొమ్మిది మందికి ఇంకా ఎందుకు ప్రకటించిన పరిహారం ఇవ్వలేదు..?' అంటూ ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన దుర్ఘటన అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభలో పలు ప్రశ్నలు వేసింది. గత ప్రభుత్వ హయాంలోనే ఆ సంఘటనకు సంబంధించి విచారణ కమిటీ నివేదికను ఇవ్వగా, అప్పుడే దాన్ని ప్రభుత్వ పెద్దలు తొక్కిపెట్టిన వైనాన్ని అధికార పార్టీ ప్రస్తావించింది. అక్కడ సినిమా దర్శకుడు బోయపాటికి ఏం పని పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం గమనార్హం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జోగిరమేశ్, జక్కంపూడి రాజాలు ఈ అంశం గురించి ప్రశ్నించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోయారని జక్కంపూడి రాజా అన్నారు. అరవై నాలుగు లక్షలు పెట్టి డాక్యుమెంటరీని చిత్రీకరించే ప్రయత్నం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందన్నారు. వారి మరణానికి కారణం చంద్రబాబు నాయుడే అని రాజా అన్నారు. సోమయాజులు కమిషన్ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. ఈ వ్యవహారం కేబినెట్ సబ్ కమిటీ ద్వారా పనర్విచారణ జరిపించనున్నట్టుగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.