ఇది చాలు, జగన్ డైనమిక్ పాలిటిక్స్ గురించి చెప్పడానికి, సాధారణంగా రాజకీయాలు అంటే విధ్యార్ధి, యువత పెద్దగా పట్టించుకోరు, పైగా అసహ్యించుకుంటారు. కానీ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్ధిని జగన్ మంత్రి వర్గంలో తనకు పనిచేయాలని ఉందని చెప్పి ఏకంగా సీఎంనే ఆశ్చర్యపరచింది.
మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ సమీక్షలో పాలుపంచుకున్న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన చంద్రిక అనే ఒక అమ్మాయి జగన్ విద్యారంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మకమైన మార్పులను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా తండ్రి వైఎస్సార్ ని మించి తనయుడు జగన్ పనిచేస్తున్నారని, తన తండ్రి అనారోగ్యం పాలు అయితే ఆరోగ్యశ్రీతో ఆదుకున్నారని ప్రశంసించారు. పేదల ప్రభుత్వంగా జగన్ సర్కార్ ఉందని అన్నారు.
అంతటితో ఆపకుండా ఆమె మీ మంత్రివర్గంలో ఒక మంత్రిగా పనిచేయాలని వుంది జగన్ సార్ అనడంతో అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. జగన్ చిరునవ్వుతో మీరు ఊరు ఏది అంటూ ఆరా తీయడం ఆసక్తిని గొలిపే ఘటనే.
విజయవాడలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న చంద్రికకు ఆముదాలవలస. అంటే ప్రస్తుత స్పీకర్ తమ్మినేని నియోజకవర్గం. మరి జగన్ ఆమెకు వరం ఇస్తే కనుక పెద్దాయనకు ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు సరదాగా సెటైర్లు వేస్తున్నారు.