చుండూరు మారణహోమం జరిగి నేటికి ముప్పైయ్యేళ్ళు. కత్తులు, గొడ్డళ్ళు, బరిసెలతో చుండూరు, ఆ చుట్టుపక్కల ఊర్ల రెడ్లు చుండూరు దళితుల్ని వెంటాడి, వేటాడి, నరికి చంపి గొనె సంచుల్లో మూటకట్టి పొలాల్లో, తుప్పల్లో, కాలవల్లో తోక్కేసిన కుల వివక్ష వేయిపడగలు విప్పి నాట్యం చేసిన రోజు. యావత్ భారత దేశం సిగ్గుపడ్డ రోజు. కానీ నేటికీ ఈ కుల సమాజం నిస్సిగ్గుగా వివక్షను పాటిస్తూనే ఉంది.
ఈ చుండూరు మారణకాండకు ముందు కులవివక్ష బహిరంగంగానే కనిపించేది. సైకిల్ మీద వెళ్లనివ్వకపోవడం, హోటల్ లో రెండు గ్లాసులు, ఇలా చాలా రూపాల్లో కనిపించేది. ఇప్పుడు అలా కనిపించకపోవచ్చు. అలాగే చుండూరుకు ముందు తమ కులాన్ని సూచించే పేర్లు (రెడ్డి, నాయుడు, చౌదరి) మగాళ్ళ పేర్ల చివర్లో కనిపించేవి. ఇప్పుడు ఈ తోకలు ఆడవాళ్ళ పేర్లకు కూడా తగులుకున్నాయి. అంటే కుల స్పృహ విస్తరించింది.
ఈ కుల స్పృహ ఇతర కులాలకు కూడా అంటుకుంది. ఆత్మ గౌరవం పేరుతో తమ కులాన్ని పేరు చివర్న తగిలించుకోవడం మాదిగల నుండి రజక, బోయ, కురుమ, తదితరాది కులాలకు కూడా అంటుకుంది. ఉత్తర భారత దేశంలో యాదవ కులం పేరు ఎప్పటినుండో పేరుచివర నిలిచిపోగా అది మన తెలుగు నేలమీద మాత్రం రెండుమూడు దశాబ్దాలుగానే తిరుగుతోంది. అలాగే గౌడ కూడా. కానీ చుండూరు తర్వాత బాగా ప్రచారంలోకి వచ్చిన కులం మాదిగ.
చాలా మంది మాదిగ యువకులు తమ పేరు చివర తమ కులాన్ని తగిలించేసుకున్నారు. అయితే ఓ దశాబ్దం నుండి మళ్ళీ ఈ “మాదిగ” టైటిల్ పేరు చివరి నుండి మాయం అవుతూ వస్తోంది. ఇక పేర్లలో కులం ప్రకటించుకునే ఈ పద్దతి గురించి చర్చ కాస్త పక్కన పెడితే కుల వివక్ష ఎలా రూపం మార్చుకుని ఈ ఎలక్ట్రానిక్ యుగంలో కూడా ఎంత గట్టిగా, గమ్మత్తుగా పనిచేస్తోందో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
విద్యా సంస్థల నుండి ఈ వివక్ష కనిపించకుండా పనిచేయడం మొదలు పెట్టింది. ఇతర కులాల ఉపాధ్యాయులు నర్మగర్భంగా కులవివక్షను విద్యార్థులకు మార్కుల రూపంలో చూపిస్తున్నారు. “వాళ్ళకు అన్ని మార్కులు అవసరం లేదు. రిజర్వేషన్లు ఉన్నాయిగా” అంటూ హేళన చేయడమే కాదు, మార్కులు తగ్గించడం కూడా కనిపిస్తోంది. చివరికి ర్యాంకులకోసం నానా తంటాలు పడే కార్పొరేట్ స్కూళ్ళలో, కాలేజీల్లో కూడా “స్పెషల్ క్లాసెస్” పద్దతినుండి వీళ్ళను తప్పించేస్తున్నారు. “మీకెందుకు స్పెషల్ క్లాసెస్? మీకు పాస్ మార్కులొస్తే చాలుగా?” అనడం, ఆ విద్యార్థులను కించపరచడం ఈ మధ్య వింటూ ఉన్నాం.
ఇక కిందా, మీదా పడి పాసయ్యి, రిజర్వేషన్ కారణంగా సీటు తెచ్చుకుని కాలేజిలోనే, ఈ మధ్య వచ్చిన డీమ్డ్ యూనివర్సటీలోనో చేరితే “ర్యాగింగ్” పేరుతో జరిగే ప్రత్యేక దాడి చాటున కుల వివక్ష మరీ దారుణంగా కనిపిస్తోంది. ప్రతి కాలేజీ నుండి కనీసం ఒకరిద్దరు విద్యార్థులైనా ఈ “దాడి” తట్టుకోలేక చదువు వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలా విద్యార్థులు వదిలేసిన సీట్లను జనరల్ పూల్ లోకి మార్చి తమ విద్యార్థులతో నింపేసుకుంటున్నారు. ఒకవేళ అలా నింపేసుకోలేక పోయినా “చదువుకునే అవకాశం” ఆ కులాల్లో ఓ ఇద్దరికైనా లేకుండా చేశాం కదా ఈ యేడాది అనే సంతోషంలో మునిగి తేలుతున్నారు.
సరే, ఈ దాడి కూడా తట్టుకుని ఉద్యోగంలోకి ప్రవేశిస్తే, ఇక్కడ కనిపిస్తున్న వివక్ష మరీ దుర్మార్గంగా ఉంటోంది. అసలు ఉద్యోగాలే ఉండడం లేదు. ఒకవేళ ఉన్నా ఏదో ఓ రూపంలో ఎస్ సి కోటా ఉద్యోగాలు భర్తీ చేయరు. అందుకు వారికి ఏదో ఓ కారణం కనిపిస్తుంది. ఇలా యేళ్ళ తరబడి భర్తీ కాకుండా ఖాళీగా ఉంచి చివరికి వాటిని ఏదో రూపంలో “జనరల్ పూల్” లో కలిపేస్తున్నారు.
ఒకవేళ ఉద్యోగంలో చేరితే ప్రమోషన్లు యేళ్ళకొద్దీ ఏదో కారణంతో నిలిపేస్తున్నారు. కీలకమైన పోస్టింగులు ఉండవు. ప్రైవేటు రంగంలో కూడా ఈ వివక్ష బాగానే ఉంది. కుల ప్రస్తావన లేకుండా కేవలం సమర్ధత ప్రతిపాదికగానే ఉద్యోగం వచ్చినా, సహచరులు వెంటనే కులం తెల్సుకుని సహకరించడమో, సహకరించకపోవడమో కనిపిస్తూనే ఉంటుంది.
ప్రభుత్వ రంగంలో బ్యాక్ లాగ్ పోస్టులు … ప్రమోషన్లు నిలిపేసిన పోస్టులు … ఇవన్నీ రూపం మార్చుకున్న కుల వివక్షకు ప్రతిరూపాలే.
ఈ రూపం మార్చుకున్న కుల వివక్షపై పోరాడేందుకు 1980 దశకం నాటి ఉద్యమం ఏదీ కనిపించడం లేదు. అలాంటి ఉద్యమ స్ఫూర్తినిచ్చే నేతలు, ఉద్యమ కారులు కూడా కనిపించడం లేదు.
ఒకప్పుడు తెలుగు నేలపై చాలా మంది సంస్కర్తలు కనిపించేవారు. ఇప్పుడు ఆ సంస్కర్తలు కూడా మాయం అయ్యారు.
Facebook post by Gopi Dara