కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో ముఖ్య నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జ్ సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలున్నాయి. శాప్ చైర్మన్‌గా బైరెడ్డి బాధ్యతలు స్వీకరించే సందర్భంగా మరోసారి పార్టీలో అంతర్గత లుకలుకలు బట్టబయలయ్యాయి.
నందికొట్కూరులో పార్టీకి ఏ దిక్కూ లేని రోజుల్లో యువకుడైన బైరెడ్డి తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డిని కాదని వైసీపీ వైపు నిలిచాడు. దీంతో బైరెడ్డిపై జగన్ అభిమానాన్ని పెంచుకున్నారు. బైరెడ్డిని తన గుండెల్లో పెట్టుకుంటానని ఎన్నికల ప్రచారంలో జగన్ అన్నారు.
ఇటీవల బైరెడ్డికి స్టోర్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) చైర్మన్ పదవి ఇచ్చి సముచిత గౌరవం కల్పించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బైరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైసీపీ ముఖ్యనేతలంతా విజయవాడకు వెళ్లారు. కానీ సొంత నియోజకవర్గమైన నందికొట్కూరు ఎమ్మెల్యే, సొంత పార్టీ నేత ఆర్ధర్ మాత్రం బైరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎక్కడా కనిపించలేదు.
ఈ విషయమై పార్టీ చర్చ జరుగుతోంది. ఆర్థర్‌ను బైరెడ్డి ఆహ్వానించలేదని సమాచారం. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో విభేదా లున్నాయనే సంగతి అధిష్టానానికి తెలిసొచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకుంది. నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి, ఆర్థర్ వర్గాలుగా వైసీపీ శ్రేణులు విడిపోయాయి.
పరస్పరం దాడులు, కేసులు పెట్టుకున్న ఘటనలు కూడా లేకపోలేదు. చాలా వరకూ నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి తన పట్టు నిలుపుకుంటున్నారని సమాచారం. బైరెడ్డి ఆధిపత్యానికి , లెక్కలేని తనానికి అధిష్టానం కళ్లెం వేయలేదనే ఆవేదన ఆర్థర్ వర్గీయుల్లో ఉంది.
మరోవైపు తమ నాయకుడి వల్లే ఆర్ధర్ గెలుపొందారని బైరెడ్డి సిద్ధార్థ్ వర్గీయులు చెబుతున్నారు. ఏది ఏమైనా శాప్ చైర్మన్ పదవీ బాధ్యతలకు ఆర్థర్‌ను ఆహ్వానించకపోవడం కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్థర్‌ను బైరెడ్డి ఏ మాత్రం లెక్క చేయడం లేదనే వాదన బలపడుతోంది.