సమస్యల్ని కొని తెచ్చుకోవడంలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మరొకరు సాటి రారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు, తన తండ్రి వైఎస్సార్ పేరు పెట్టడంతో కొత్త సమస్యని కోరి తెచ్చుకున్నట్టైంది. తాజాగా వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ను ఎన్నుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడం గమనార్హం. ఇది కూడా జగన్ కోరి తెచ్చుకోవడమే.
శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోడానికి ఏకంగా వైసీపీ రాజ్యాంగాన్ని మార్చుకున్నారు. రాజ్యాంగం అంటే పార్టీలకు, వ్యక్తులకు వేర్వేరుగా వుండదు. అందరికీ ఒకే రాజ్యాంగం వుంటుంది. దాన్ని అనుసరించి అందరూ నడుచుకోవాల్సి వుంటుంది. కానీ వూరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టెది మరో దారి అనే చందంగా వైసీపీ రూటే సపరేట్ కదా?
వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని వైసీపీ ప్లీనరీ సమావేశాల్ని నిర్వహించారు. వైసీపీ ప్లీనరీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సమావేశాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ తప్పుకోవడం, రెండోది పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ను ఎన్నుకోవడం. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినట్టు ఇవాళ వెలుగులోకి వచ్చింది. శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చెల్లదని ఈసీ తేల్చి చెప్పింది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ధోరణి సరైంది కాదని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి ఆదేశాలతో కూడిన ఉత్తర్వులు ఇచ్చినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. జగన్ శాశ్వత అధ్యక్షతపై మీడియాలో వార్తల్ని చూసి స్పందించినట్టు ఈసీ పేర్కొంది. విజయసాయిరెడ్డికి రాసిన ఉత్తర్వుల్లో ఏముందంటే…
“ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి శాశ్వత అధ్యక్షుడు, ఒక పదవికి శాశ్వత నియామకం ఉండదు. ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు ఎన్నికలు జరగాలి. ఈసీ నియమావళి అంగీకరించిన తర్వాతే పార్టీల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈసీ నియమ నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకోవడంపై పలుమార్లు వైసీపీని వివరణ కోరినా ఎలాంటి స్పందనా లేదు. దీంతో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమైన వ్యవహారమని ప్రకటిస్తున్నాం. ఇలాంటివి చెల్లుబాటు కాదు” అని ఈసీ తేల్చి చెప్పింది.
అంతేకాదు, దీనిపై అంతర్గత విచారణ జరిపి నివేదికను తమకు పంపాలని పార్టీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్టు ఈసీ స్పష్టం చేసింది. ఈసీ నిబంధనలు ఏమున్నాయో కూడా చూసుకోకుండా జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకుని కేంద్ర ఎన్నికల సంఘంతో చీవాట్లు తినడం ఏంటి? ఇది వైసీపీ శ్రేణుల్ని నవ్వులపాలు చేయడం కాదా? ఈ మాత్రం కూడా తెలియకుండా పార్టీని నడుపుతున్నారా? అనే ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు.