ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఇంట్లో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా కరణ్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. కోవిడ్ పరీక్షలో తన ఇంటి స్టాఫ్ ఇద్దరికి కరోనా నిర్ధారణ అయినట్టు ఆయన చెప్పారు. మిగిలిన కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.
కరోనా సోకిన ఇద్దరిని తన ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచామని, వారికి అన్ని విధాల అండగా నిలుస్తామని, అధికారుల సూచనలు పాటిస్తూ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. వారికి మంచి వైద్యం అందిస్తున్నామని, వారిద్దరూ త్వరగా కోలుకుంటారని కరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరణ్ ట్వీట్‌లో ఏముందంటే…
“ఇంటి సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ కాగానే వెంటనే ముంబై మున్సిపాల్ కార్పోరేషన్‌కి సమాచారం ఇచ్చాం. సిబ్బంది వచ్చి మా ఇంటిని, చుట్టు పక్కన ప్రాంతాన్ని కెమికల్ స్ప్రే చేశారు. నిబంధనల ప్రకారం మా ఇంట్లో వాళ్లందరం రానున్న 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటాం. కరోనా సంక్షోభంలో ప్రతీ ఒక్కరం ప్రభుత్వ నిబంధనలను పాటిస్తే కరోనాను దీటుగా ఎదుర్కోవచ్చు. కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి” అంటూ కరణ్ ట్వీట్ చేశారు. కరణ్ ధీమా స్ఫూర్తిదాయకంగా ఉంది.
ఇదిలా ఉండగా సోమవారం కరణ్ పుట్టినరోజు. 47 ఏళ్లు పూర్తిచేసుకొని 48వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ అగ్ర దర్శకుడికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఇంట్లోనే కేక్ కట్ చేశారు కరణ్. తన ఇద్దరు పిల్లలు యశ్ , రూహి సరదాగా తనను బుడ్డా (ముసలోడా ) అంటూ పిలిచిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. (యశ్ నోట ‘ఐ లవ్ ఇండియా’ ) లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి జుత్తుకు రంగు వేయక తెల్లబడిందని, దీంతో పిల్లలు ముసలోడా అంటూ ఆట పట్టిస్తున్నారని కరణ్ పేర్కొన్నారు.