సినిమా హీరోలు తెరపై ఏమో సామాన్యుల పాత్రల్లో కనిపిస్తూ ధనికులపై సెటైర్లు వేస్తారు. ధనికులు ట్యాక్సులు ఎగ్గొట్టడం గురించి లెక్చర్లు ఇస్తారు. అయితే నిజజీవితంలో కోటీశ్వరులు అయిన స్టార్ హీరోలు తీరా తమ వరకూ వచ్చే సరికి ట్యాక్స్ ఎగ్గొట్టడటం సంగతి అలా ఉంచితే, తాము కొనే విలాస వస్తువులకు పన్ను మినహాయింపులను ఇవ్వాలంటూ కోర్టులను కూడా కోరతారు. అది కూడా వారు కోట్ల రూపాయలు పెట్టి కొనే కార్ల విషయంలో పన్ను మినహాయింపులు కోరడం విడ్డూరం.
సినిమాల్లో ఎన్నో నీతులు చెప్పే హీరోలకు ఈ మినహాయింపులు కోరడం మాత్రం అనుచితం అనిపించదు కాబోలు. ఇటీవలే ఇలాంటి వ్యవహారంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ కోర్టు చేత చీవాట్లు తిన్నాడు. తను ఎప్పుడో కొన్న కారుకు సంబంధించి పన్ను మినహాయింపు కేసు విచారణలో భాగంగా విజయ్ కోర్టు చేత మొట్టికాయలు తిన్నంత పనైంది.
ఖరీదైన విదేశీ కారును కొని, దానిపై దిగుమతి తదితర పన్నులు పూర్తి స్థాయిలో చెల్లించకుండా కోర్టును ఆశ్రయించాడు విజయ్. సుదీర్ఘ కాలం అనంతరం ఆ కేసు విచారణకు వచ్చింది. ఆ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సినిమాల్లో నీతులు చెప్పే విజయ్ వాస్తవంలో వాటిని ఆచరించాలంటూ తన తీర్పులో పేర్కొన్నారు న్యాయమూర్తి. విజయ్ కు ఆ ఝలక్ తగిలిన నేపథ్యంలో.. ఇలాంటి పిటిషనే దాఖలు చేసిన మరో తమిళ స్టార్ ధనుష్ అలర్ట్ అయ్యాడు.
2015లో ఒక ఇంపోర్టెడ్ కారును కొన్నాడట ధనుష్. దానికి సంబంధించి అప్పట్లో 50 శాతం పన్నును మాత్రమే చెల్లించాడట. మిగతాది మినహాయించాలంటూ కోర్టును ఆశ్రయించాడట. తాజాగా ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే ధనుష్ వెంటనే అలర్ట్ అయ్యాడు. విజయ్ విషయంలో వచ్చిన తీర్పును గమనించి.. ఈ పిటిషన్ ను వెనక్కు తీసుకుంటానంటూ కోర్టును కోరాడట. అయితే.. విచారణకు లిస్ట్ అయిన దశలో పిటిషన్ ను వెనక్కు తీసుకోవడానికి కోర్టు అనుమతిని ఇవ్వలేదు. అక్కడకూ.. తను పూర్తి స్థాయిలో పన్ను చెల్లించడానికి సిద్ధమంటూ కూడా ధనుష్ చెప్పాడట. అయితే.. పిటిషన్ ను విచారించిన కోర్టు విజయ్ కు క్లాసు వేసుకున్న తరహాలోనే ధనుష్ కు ఇంకో క్లాస్ వేసుకుంది.
కార్మికులు, కర్షకులు కష్టం నుంచి వచ్చిన పన్నులతో రోడ్లు వేసి, అలాంటి రోడ్లపై ఖరీదైన కార్లను నడుపుకునేందుకు పన్ను మినహాయింపులు కోరడం ఏమిటంటూ.. కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేగాక.. ఆ కారుపై పూర్తి పన్ను 2.15 కోట్ల రూపాయలను ఈ రోజు సాయంత్రం లోగా చెల్లించాలని మద్రాస్ హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. విజయ్ పిటిషన్ పై తీర్పు వచ్చినప్పుడే ధనుష్ మేల్కొవాల్సింది. అయితే.. ఆఖరి నిమిషంలో పిటిషన్ వెనక్కు తీసుకోవడానికి రెడీ అని, పన్ను చెల్లించడానికి రెడీ అని కోర్టుకు చెప్పి కూడా క్లాసు పీకించుకున్నాడు. అయినా కోట్ల రూపాయలు పెట్టి ఖరీదైన కార్లు కొనడానికి వెనుకాడని హీరోలు, వాటిపై పన్ను చెల్లించాలంటే మాత్రం ఎందుకు ఇలాంటి పిటిషన్లు వేస్తారో! ఇదే తెరపై కనిపించే హీరోల హీరోయిజం!