ఔను, డేటా చోరీ వాస్త‌వ‌మే!

టీడీపీ హ‌యాంలో డేటా చోరీపై స‌భా సంఘం చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగి తేల్చి చెప్పారు. డేటా చోరీ వాస్త‌వ‌మే అని మ‌ధ్యంత‌ర నివేదిక ద్వారా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు…

టీడీపీ హ‌యాంలో డేటా చోరీపై స‌భా సంఘం చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగి తేల్చి చెప్పారు. డేటా చోరీ వాస్త‌వ‌మే అని మ‌ధ్యంత‌ర నివేదిక ద్వారా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న అసెంబ్లీకి మ‌ధ్యంత‌ర నివేదిక స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీలో భూమ‌న మాట్లాడుతూ త‌న నేతృత్వంలో స‌భా సంఘం ఏర్ప‌డిన త‌ర్వాత డేటా చోరీపై నిగ్గు తేల్చేందుకు నాలుగు ద‌ఫాలు స‌మావేశ‌మైన‌ట్టు చెప్పుకొచ్చారు.

వివిధ శాఖ‌ల అధికారులు, సంబంధిత నిపుణుల‌తో చ‌ర్చించామ‌న్నారు. సేవా మిత్ర అనే యాప్‌ను టీడీపీ దుర్వినియోగం చేసింద‌న్నారు. ఈ యాప్‌ను అడ్డు పెట్టుకుని పౌరుల డేటాను చోరీ చేసి, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు వాడుకుంద‌ని భూమ‌న తెలిపారు. అలాగే 30 ల‌క్ష‌ల ఓట్ల‌ను తొల‌గించేందుకు గ‌తంలో అధికారంలో వున్న పార్టీ ప్ర‌య‌త్నించింద‌ని ఆయ‌న ఆరోపించారు.

గత టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడినట్లు సభా సంఘం ప్రాథ‌మికంగా నిర్ధారణకు వచ్చిందన్నారు. అయితే డేటా చోరీపై మ‌రింత లోతుగా విచార‌ణ జ‌ర‌గాల్సి వుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. త‌మ‌కు ఓటు వేయ‌రనుకున్న వాళ్ల స‌మాచారాన్ని టీడీపీ స్టేట్ డేటా సెంట‌ర్ నుంచి సేవామిత్ర యాప్ ద్వారా పూర్తిగా చోరీ చేసేందుకు య‌త్నించింద‌న్నారు. అయితే చోరుల‌ను ప‌ట్టుకునేందుకు మ‌రింత లోతుగా విచారిస్తామ‌న్నారు.

డేటా చోరీ వ్య‌వ‌హారంపై నిగ్గు తేల్చేందుకు భూమ‌న నేతృత్వంలోని స‌భా సంఘం క‌మిటీ ఇప్ప‌టికే నాలుగు ద‌ఫాలు సంబంధిత అధికారుల‌తో చ‌ర్చించింది. వారి నుంచి కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టింది. ప్రాథ‌మికంగా డేటా చోరీ జ‌రిగింద‌ని ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన అనంత‌రం మ‌ధ్యంత‌ర నివేదిక‌ను అసెంబ్లీకి స‌మ‌ర్పించింది. త‌దుప‌రి చ‌ర్య‌ల‌పై టీడీపీలో ఆందోళ‌న నెల‌కుంది. 

డేటా చోరీకి పాల్ప‌డ‌లేద‌ని, ఎలాంటి ప‌రిణామాలైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామ‌ని టీడీపీ యువ నేత నారా లోకేశ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే స‌భాసంఘం మ‌ధ్యంత‌ర నివేదిక టీడీపీని ఎంత వ‌ర‌కు ఇర‌కాటంలో ప‌డేస్తుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.