తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా మంచోడు. ఈ మంచితనం ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదు. రాజకీయాలకు సంబంధించింది. ఆయన వ్యక్తిగత జీవితం జనాలకు అనవసరం కదా. రాజకీయంగా, ముఖ్యమంత్రిగా ఆయన ఎంతమేరకు మంచిగా వ్యవహరిస్తున్నారనేదే ప్రధానం. ప్రతిపక్షాలు చాలా విషయాల్లో ఆయన్ని తీవ్రంగా విమర్శిస్తుంటాయి. అది పార్టీ అధినేతగా చేసే రాజకీయాల గురించి కావొచ్చు. ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయాలు కావొచ్చు. ప్రస్తుతం కేసీఆర్ చాలా మంచోడని మనం ఆయనకు కితాబు ఇవ్వడంలేదు. తానే చెప్పుకున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోనే టీఆర్ఎస్లోకి ఫిరాయించిన కాంగ్రెసు ఎమ్మెల్యేలు చెప్పారు. అంటే కేసీఆర్ మంచితనమంతా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిందన్నమట.
కేసీఆర్ మాటల మరాఠీ అని, మాటల గారడీ చేస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో 19 మంది కాంగ్రెసు నేతలు ఎమ్మెల్యేలుగా గెలిస్తే 12 మంది అధికార పార్టీలో చేరిపోయారు. వీరు పోగా మిగిలినవారు ఏడుగురు ఉండేవారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఆరుగురు మిగిలారు. ప్రత్యేక తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ పరిపాలన మొదలయ్యాక ఉధృతంగా ఫిరాయింపులతోనే పాలన ప్రారంభమైన సంగతి తెలసిందే. రెండోసారీ ముఖ్యమంత్రి కాగానే అదే కథ రిపీటయ్యింది. గెలిచిన కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఆగలేకపోయారు. ఆగమేఘాల మీద వెళ్లి టీఆర్ఎస్లో చేరారు. దీంతో కాంగ్రెసు వెన్నువిరిగిపోయింది. పార్టీ ఫిరాయింపులపై ఎన్నడూ పెద్దగా స్పందించని కేసీఆర్ తాజాగా తాను మంచోడినని తనకు తానే కితాబిచ్చుకొని 'మీకు అన్యాయం జరిగింది' అని కాంగ్రెసోళ్లపట్ల సానుభూతి వ్యక్తం చేశారు.
కాంగ్రెసు ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో తన తప్పేమీ లేదని చెప్పుకున్నారు. వాళ్లను రమ్మని తాను అడగలేదని, 'వద్దయ్యా…ఎందుకొస్తరు? మాకు అవసరం లేదు' అని చెప్పినా వారు వినలేదని, ఇక కాదనలేక చేర్చుకున్నామని చెప్పారు గులాబీదళపతి. ఫిరాయింపులకు పూర్తి బాధ్యత కాంగ్రెసు నాయకత్వానిదేనని తేల్చిపారేశారు. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా ఆకర్షణ తగ్గింది కాబట్టి పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని, ఎమ్మెల్యేలను కాపాడుకోలేక తనపై నిందలేస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులు రాజ్యాంగబద్ధమేనని చెప్పిన కేసీఆర్ టూ థర్డ్ విడిపోయి వస్తే ఎవ్వరైనా విలీనం చేసుకోకుండా ఉంటారా? అని కూడా ప్రశ్నించారు. ఇందుకు ఉదాహరణలుగా టీడీపీ ఎంపీలు, గోవాలో కాంగ్రెసు సభ్యులు బీజేపీలో విలీనం కావడాన్ని చెప్పారు. మొత్తంమీద తప్పంతా కాంగ్రెసు నాయకత్వం మీద నెట్టేశారు.
ఇక టీఆర్ఎస్లోకి ఫిరాయించిన కాంగ్రెసు ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు క్లీన్చిట్ ఇచ్చారు. 'ఆయన తప్పేమీ లేదు. మేమే సార్ వెంటపడ్డాం. సార్..సార్ మమ్మల్ని విలీనం చేసుకోండి సార్ అడిగాం'…అని మీడియాకు చెప్పారు. వారు ఇంతటితో ఆగలేదు. 'నో ప్యాకేజ్..ఓన్లీ డెవెలప్మెంట్. ఈ ఉద్దేశంతోనే అందరం నిర్ణయం తీసుకున్నాం. దీన్ని కాంట్రవర్సీ చేయొద్దు. అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరాం' అని చెప్పుకొచ్చారు. పాపం..వీళ్లు కూడా చాలా మంచోళ్లు. మరి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలప్పుడు వీరిలో కొందరు ప్రచారం కోసం తన ప్రాంతాలకు వెళ్లినప్పుడు జనం ఎందుకు తిరగబడ్డారో, ఎందుకు దాడులు చేశారో చెప్పలేదు. ఫిరాయింపుదారులకు ప్యాకేజీ ఉండదని వీరు చెప్పడం జనం చెవ్వుల్లో పెద్ద పెద్ద పువ్వులు పెట్టడమే. ఫిరాయింపుల విషయంలో తానేం పాపం చేయలేదని చెప్పుకుంటున్న కేసీఆర్ రిజైన్ చేసి టీఆర్ఎస్ టిక్కెట్‌పై గెలవండని ఎందుకు చెప్పలేకపోయారు? ఆ నిబంధన పెడితే పోలోమంటూ వచ్చి చేరతారా?
వారే వెంటబడి టీఆర్ఎస్లో చేరారని చెప్పుకుంటున్న కేసీఆర్ గతంలో కొన్నిసార్లు తానే స్వయంగా కొందరి ఇళ్లకు వెళ్లి పార్టీలోకి రావాలని అడగలేదా? టీడీపీని నిర్వీర్యం చేయడానికి కేటీఆర్‌ను, హరీష్‌రావును ఉపయోగించలేదా? ఏ ఫిరాయింపుల వెనకనైనా ఏదో రూపంలో ఆర్థిక ప్రయోజనాలు తప్పనిసరిగా ఉంటాయి. అభివృద్ధికోసమో, బంగారు తెలంగాణ కోసమో చేరామని చెప్పుకోవడం పెద్ద అబద్ధం. ప్రస్తుత కర్నాటక సంక్షోభంలో ఆర్థిక ప్రయోజనాలున్నాయి. పార్టీ ఫిరాయిస్తే 40 నుంచి 50 కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేస్తోందని కుమారస్వామి చెప్పారు. తాను చట్టం ప్రకారమే వ్యవహరించానని కేసీఆర్ చెప్పుకోవచ్చు. కాని అది నైతికంగా పతనమైనట్లు కాదా? తాను గొప్ప నాయకుడినని చెప్పుకుంటున్న కేసీఆర్ నైతికంగా సరిగ్గా ఉంటే చరిత్రలో నిలిచిపోతారు. నైతిక విలువలు లేకుంటే చంద్రబాబైనా, మోదీ అయినా గొప్పనేతలు కాలేరు.