క‌రోనా నియంత్ర‌ణ‌లో దేశంలోనే ఏపీ టాప్

ప్ర‌పంచాన్ని భ‌యభ్రాంతుల‌కు గురి చేస్తున్న క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో ఏపీలోని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మెరుగైన స్థితికి చేరుతూ ఉంది. అనేక ర‌కాల మార్గాల ద్వారా ఏపీలోకి క‌రోనా వైర‌స్ ప్ర‌వేశించ‌గా,…

ప్ర‌పంచాన్ని భ‌యభ్రాంతుల‌కు గురి చేస్తున్న క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో ఏపీలోని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మెరుగైన స్థితికి చేరుతూ ఉంది. అనేక ర‌కాల మార్గాల ద్వారా ఏపీలోకి క‌రోనా వైర‌స్ ప్ర‌వేశించ‌గా, తీవ్ర స్థాయిలో అది వ్యాపించ‌కుండా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు ఫ‌లితాల‌ను ఇస్తున్నాయి. కోవిడ్ 19 టెస్టుల్లో మొద‌టి నుంచి ముందున్న ఏపీ ప్ర‌భుత్వం ఇప్పుడు అస‌లైన ఫ‌లితాల‌ను చూపిస్తూ ఉంది. వీలైనంత ఎక్కువ‌మందికి ప‌రీక్ష‌లు చేయ‌డం అనేది క‌రోనా నియంత్ర‌ణ‌కు కీల‌క‌మైన విష‌యం అని మొద‌టి నుంచి అనేక మంది ప‌రిశోధ‌కులు చెబుతూ వ‌చ్చారు. క‌రోనా నియంత్ర‌ణ‌లో ముందున్న ద‌క్షిణ కొరియా ప్ర‌భుత్వం కూడా అదే మాటే చెప్పింది. 

ఆ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం చూపిన చొర‌వ అభినంద‌నీయం. మాన‌వాళికే కొత్త అయిన ఈ వైర‌స్ ను నియంత్రించ‌డంలో భాగంగా.. ఏపీ ప్ర‌భుత్వం భారీ సంఖ్య‌లో పరీక్ష‌లు చేసింది. దీంతో జ‌న జీవ‌న స్ర‌వంతిలో భాగ‌మైపోయిన క‌రోనా వైర‌స్ వ్యాధిగ్ర‌స్తులకు చికిత్స అందించ‌డం సులువుగా మారింది. అనుమానితుల‌ను క్వారెంటైన్ కు తీసుకెళ్ల‌డం, అక్క‌డ ప‌రీక్ష‌లు చేయ‌డం వంటి చ‌ర్య‌ల‌తో ఏపీలో క‌రోనా ఇన్ఫెక్ష‌న్ బాగా త‌గ్గుముఖం ప‌ట్టింది. ఎంత‌లా అంటే.. ఇప్పుడు దేశంలో క‌రోనా ఇన్ఫెక్ష‌న్ రేటు త‌క్కువ‌గా ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో ఉంది. ఐదు కోట్లకు మించి జ‌నాభా ఉన్న రాష్ట్రాల్లో.. 0.92 శాతం ఇన్ఫెక్ష‌న్ రేటుతో ఏపీ మెరుగైన స్థితిలో ఉంది.

ఏపీ త‌ర్వాత క‌ర్ణాట‌క ఒక్క శాతం ఇన్ఫెక్ష‌న్ రేటుతో ఉంది. దేశ స‌గ‌టు ఇన్ఫెక్ష‌న్ రేటు 4.48 శాతం వ‌ర‌కూ ఉండ‌గా.. ఏపీలో కేవ‌లం 0.92 శాతం ఉండ‌టం క‌రోనా పై పోరాటంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వ చొర‌వ‌కు సాక్షంగా నిలుస్తూ ఉంది.

మొద‌ట త‌బ్లిగీ, ఆ త‌ర్వాత వ‌ల‌స కార్మికుల వ‌ల్ల ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య పెరిగింది. సామూహిక వ్యాప్తి ఏపీలో ఏ మాత్రం లేకుండా చూసుకుంది ప్ర‌భుత్వం. అంతేకాదు.. రిక‌వ‌రీ రేటులోనే ఏపీనే నంబ‌ర్ వ‌న్ పొజిష‌న్లో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా వైర‌స్ కు గురి అయిన వారిలో 65 శాతం మందికి చికిత్స చేసి, వారి ఆరోగ్యాన్ని బాగు చేసి, డిశ్చార్జి చేసింది ఏపీ ప్ర‌భుత్వ వైద్య శాఖ‌. దేశంలో 65 శాతం రిక‌వ‌రీ ఉన్న‌రాష్ట్రం మ‌రోటి ఇప్ప‌టి వ‌ర‌కూ లేదు. 

ప‌క్క రాష్ట్రాల నుంచి క‌రోనా ప్ర‌మాదాలు ఏవీ ముంచుకు రాక‌పోతే.. రాష్ట్రాల మ‌ధ్య‌న ప్ర‌యాణాలు మ‌ళ్లీ మొద‌ల‌య్యాకా .. నియ‌మాల‌ను క‌రెక్టుగా పాటిస్తే.. మ‌రి కొన్నాళ్ల‌లో అయినా ఏపీలో క‌రోనా కేసులు పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంది.  తెలంగాణ‌లో అతి త‌క్కువ ప‌రీక్ష‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ నుంచి ఏపీ వైపుకు వ‌చ్చే వారి మీద ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా  దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంది. అలాంటి వారిని క్వారెంటైన్ల‌కు త‌ర‌లించి, క‌చ్చిత‌మైన ప‌రీక్ష‌లు చేశాకే బ‌య‌ట‌కు వ‌దలాల్సిన అవ‌స‌రం ఎంతైనా క‌నిపిస్తూ ఉంది.