పాట‌ల ర‌చయిత సుద్దాల‌కు కాలేయ మార్పిడి

ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత‌, జాతీయ పుర‌స్కార గ్ర‌హీత సుద్దాల అశోక్‌తేజ‌కు హైద‌రాబాద్‌లోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ ఆస్ప‌త్రిలో కాలేయ మార్పిడి శ‌స్త్ర చికిత్స జ‌రిగింది.  శ‌స్త్ర చికిత్స వివ‌రాల‌ను అశోక్‌తేజ సోద‌రుడు,…

ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత‌, జాతీయ పుర‌స్కార గ్ర‌హీత సుద్దాల అశోక్‌తేజ‌కు హైద‌రాబాద్‌లోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ ఆస్ప‌త్రిలో కాలేయ మార్పిడి శ‌స్త్ర చికిత్స జ‌రిగింది.  శ‌స్త్ర చికిత్స వివ‌రాల‌ను అశోక్‌తేజ సోద‌రుడు, తెలంగాణ ప్ర‌భుత్వ వాస్తు స‌ల‌హాదారుడు సుద్దాల సుధాక‌ర్ తేజ వెల్ల‌డించారు. శ‌నివారం  ఉద‌యం నుంచి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు డాక్ట‌ర్ బాల‌చంద‌ర్‌, డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ నేతృత్వంలో కాలేయ మార్పిడి శ‌స్త్ర చికిత్స విజ‌య‌వంతంగా జ‌రిగింద‌న్నారు.

త‌న అన్న చిన్నకుమారుడు అర్జున్‌ కాలేయంలో కొంత భాగం ఇచ్చార‌న్నారు. ప్రస్తుతం తండ్రీకొడుకులిద్దరూ క్షేమంగా ఉన్నా రని ఆయ‌న‌ పేర్కొన్నారు. సుద్దాల అశోక్ తేజ  సుమారు 1200కి పైగా చిత్రాల్లో 2200 పై చిలుకు పాటలు రాశారు.  ఠాగూర్ (2003) చిత్రంలో ఆయన రచించిన నేను సైతం అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం ద‌క్కింది.

అశోక్‌తేజ తండ్రి హనుమంతు ప్రముఖ ప్రజాకవి. ఆయ‌న పేరు తెలుగు స‌మాజానికి ఓ స్ఫూర్తి. తెలంగాణా విముక్తి పోరాటంలో అలుపెర‌గ‌ని పోరాటం చేశారాయ‌న‌. నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. సొంతూరు సుద్దాల వాళ్ల ఇంటి పేరుగా మారింది.  ఆయ‌న క‌ళా వార‌సత్వం అశోక్‌తేజ‌కు వచ్చింది.

అశోక్‌తేజ అంటే ప్ర‌ధానంగా గుర్తొచ్చే పాట‌లు  నేను సైతం ప్ర‌పంచాగ్నికి స‌మిధ‌నొక్క‌టి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వ‌వృష్టికి అశ్రువొక్క‌టి ధార‌పోశానుతో పాటు  నేలమ్మ నేలమ్మ నేలమ్మా.., ఒకటే జననం ఒకటే మరణం , దేవుడు వరమందిస్తే… నే నిన్నే కోరుకుంటానే,  నువు యాడికేళ్తే ఆడికోస్త సువర్ణా త‌దిత‌రాలు.

ఓ గొప్ప పాట‌ల ర‌చ‌యిత‌, సాహితీవేత్త త్వ‌ర‌గా కోలుకుని తిరిగి రావాలి. ఆయ‌న మ‌రిన్ని గొప్పగొప్ప‌ పాట‌లు రాయాల‌ని మ‌న‌మంతా మ‌న‌స్ఫూర్తిగా కోరుకుందాం. 

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు