ఒకవైపు దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 25 నుంచి దేశీయ విమానయాన సేవలు ప్రారంభం అవుతాయని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. విమానాల్లో ప్రయాణించాలనుకునే వాళ్లకు కొన్ని నిబంధలను పెట్టారు. వారికి కరోనా టెస్టులు దాదాపు తప్పనిసరిగా చేస్తున్నారు. తమకు కరోనా వైరస్ సోకలేదని వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందట. ఇంతకీ లాక్ డౌన్ నుంచి పాక్షిక మినహాయింపుల తర్వాత విమానయానం ఎలా ఉంటుందో స్పష్టత రావాల్సి ఉంది.
ఆ సంగతలా ఉంటే.. మరోవైపు అంతర్జాతీయ విమానాల గురించి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వాటిని కూడా పునరుద్ధరించే ప్రయత్నాలు చేయబోతున్నట్టుగా కేంద్రం తెలిపింది. ప్రస్తుతానికి విదేశాలకు రాకపోకలపై చాలా ఆంక్షలున్నాయి. చాలా దేశాలు విదేశాల నుంచి వచ్చే వారికి రెడ్ సిగ్నల్స్ వేశాయి. అయితే అలా ఎక్కువ కాలం నడవదు. ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే కొన్నాళ్లలో మళ్లీ ప్రయాణాలు మొదలుకాక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో జూలై తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావొచ్చని కేంద్ర మంత్రి హర్దీస్ పింగ్ పూరీ అభిప్రాయపడ్డారు.
ఆగస్టులో లేదా, సెప్టెంబర్ కు అయినా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతానికి అయితే ఏ దేశం కూడా విదేశస్తులను రానిచ్చే పరిస్థితుల్లో లేదు. కొన్ని దేశాలు మాత్రమే అందుకు సై అంటున్నాయి. స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించేందుకు కూడా కొన్ని దేశాలు రెడీ అంటుండటం గమనార్హం. అయితే మెజారిటీ దేశాలు మాత్రం విదేశాలతో రాకపోకలను ప్రోత్సహించే పరిస్థితుల్లో లేవు. కనీసం ఇంకా రెండు, మూడు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం అవుతోంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి విదేశీ విమానాలను పునరుద్ధరించే అవకాశం ఉందని భారత ప్రభుత్వం సూఛాయగా చెబుతూ ఉంది.