ప్రధాని నరేంద్ర మోడీని ఇరుకున పెట్టడానికి.. తద్వారా రాజకీయ మైలేజీ సంపాదించుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు.
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ వారం రోజులలో జీవో తెస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. గిరిజనులకు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని, వారి రిజర్వేషన్ల కోసం తెస్తున్న జీవోను గౌరవించడం ద్వారా.. ప్రధాని నరేంద్ర మోడీ గిరిజన సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకోవాలని కేంద్రం సహకరించకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ 10 శాతం రిజర్వేషన్ను అమలు చేస్తుందని కెసిఆర్ విస్పష్టంగా ప్రకటించారు.
నిజానికి ఈ ప్రకటన కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు దక్కగల ప్రయోజనాన్ని కేంద్రమే అడ్డుకుంటోందనే ఆరోపణలతో కేసీఆర్ ముందు ముందు విరుచుకు పడడానికి ఇది ఆస్కారం కల్పిస్తోంది. అయితే కెసిఆర్ చాలా వ్యూహాత్మక ఎత్తుగడగా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అంశాన్ని ఇప్పుడు తెరమీదకు తెచ్చినట్లుగా కనిపిస్తోంది.
కెసిఆర్ ఏ వేదిక మీద గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అంశాన్ని ప్రకటించారు అనేది చాలా కీలకంగా గమనించాలి. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఆదివాసి బంజారా ఆత్మీయ సభలో కెసిఆర్ ఈ ప్రకటన చేశారు.
సందర్భం ఫలానా అని చెప్పకపోయినప్పటికీ ఇది తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసిన సభ. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులకు ఐదు నుంచి ఆరు శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కుతూ వచ్చాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి పంపితే వాటికి ఇప్పటిదాకా అతీగతీ లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడైనా కేంద్రం శ్రద్ధ తీసుకొని ఆ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి పంపాలని అనడం ద్వారా బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేశారు కేసీఆర్.
వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల 10 శాతం రిజర్వేషన్ గురించి జీవో తెస్తుందని రాష్ట్రంలో అమలు చేస్తామని ఆయన అన్నారు. ఇలాంటి జీవో వచ్చినా సరే అది న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఎక్కువ! న్యాయపరంగా ఎంత వివాదం రేగితే అంతగా కేంద్రం మీద నిందలు వేయడానికి కేసిఆర్ కు అవకాశం దొరుకుతుంది.
జీవో తేవడం ద్వారా గిరిజనుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంది కానీ, బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే మోకాలు అడ్డుతోంది, కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.. అని రకరకాల నిందలు వేయడానికి అవకాశం దొరుకుతుంది.
గిరిజన రిజర్వేషన్ల పెంపు వ్యవహారం అనేది కేంద్రం దృష్టిలో క్లిష్టమైనది. తేనెతుట్టె లాంటిది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించడం ద్వారా ఆ తేనె తుట్టెను కదిలిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం భయం. సరిగ్గా ఆ సంక్లిష్టతనే తనకు అనుకూలంగా వాడుకోదలుచుకుంటున్నారు కెసిఆర్. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి మాటల కూర్పుతో ఎదురు దాడికి సిద్ధమవుతుందో వేచి చూడాలి.