బీజేపీ వ్యతిరేక కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి అనే ప్రచారాన్ని పొందుతున్న బిహార్ సీఎం నితీష్ కుమార్ కు పక్క రాష్ట్రం నుంచి పిలుపు వస్తోంది. దేశంలోనే ఎక్కువ లోక్ సభ నియోజకవర్గాలున్న రాష్ట్రం అది. అక్కడ నుంచి నితీష్ ఎంపీగా పోటీ చేసుకోవచ్చంటూ ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ పిలుపును ఇవ్వడం గమనార్హం.
నితీష్ కోరుకుంటే.. యూపీలోని ఫుల్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చంటూ ప్రకటించారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. నితీష్ కు ఇలా ఆయన తమ మద్దతును ప్రకటించారు. ఫుల్ పూర్ నుంచి నితీష్ కుమార్ పోటీ చేయాలంటూ అఖిలేష్ ఆహ్వానిస్తున్నారు. మరి ప్రధానమంత్రి అభ్యర్థి అంటే వేర్వేరు రాష్ట్రాల్లో మద్దతు అవసరం. కాబట్టి.. నితీష్ కు ఇలాంటి ప్రణాళికలు ఉంటే.. వేరే రాష్ట్రం నుంచి బరిలోకి దిగడం కూడా ముఖ్యమే!
ఫుల్ పూర్ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. స్వతంత్రం వచ్చిన తర్వాత నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎంపీగా పోటీ చేసి నెగ్గిన చరిత్ర ఉన్న నియోజకవర్గం ఇది. దశాబ్దాల పాటు కాంగ్రెస్ కంచుకోట. ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఉన్నారక్కిడ.
2018లో ఈ సీటుకు ఉప ఎన్నిక జరిగితే సమాజ్ వాదీ పార్టీ ఘన విజయం సాధించింది. మళ్లీ 2019లో మాత్రం బీజేపీనే నెగ్గింది. 2014లో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 50 వేల స్థాయి ఓట్లను మాత్రమే పొందాడు.