సోషల్ మీడియా వేదికగా కొన్ని రోజులుగా మహాత్మాగాంధీ, గాడ్సే గురించి వివాదాస్పద కామెంట్స్ చేస్తున్న నాగబాబుకు జనసేనాని, తమ్ముడైన పవన్‌కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా విడుదల చేసిన ప్రకటనలో క్రమ శిక్షణ అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని హితవు పలికారు. పవన్ ప్రకటన చూస్తే నాగబాబు తప్పు చేస్తున్నాడనే అభిప్రాయంలో ఉన్నట్టు అర్థమవుతోంది.
పవన్ ట్విటర్ ప్రకటనను ఒకసారి పరిశీలిద్దాం. మహాత్మాగాంధీ, గాడ్సేలపై నాగబాబు కొన్ని రోజులుగా వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. సున్నిత అంశాలపై పార్టీకి చెందిన వారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో నాగబాబు కామెంట్స్‌పై స్పష్టత ఇస్తున్నట్టు పవన్ వెల్లడించారు.
సోషల్ మీడియా వేదికగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని పవన్ కుండబద్దలు కొట్టినట్టు పేర్కొన్నారు.
పార్టీ నిర్ణయమేదైనా అధికారికంగానే ప్రకటిస్తామని ఆయన తెలిపారు. వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఇది ప్రజలు ఊహించని కష్టకాలమని తెలిపారు. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. ఇలాంటి తరుణంలో ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లొద్దని పవన్ విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని పవన్ సున్నితంగా నాగబాబును హెచ్చరిస్తూ హితవు పలికారు.