డాక్టర్ సుధాకర్ కేసు విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నాయకుడు, చీరాల మాజీ ఎమ్మె ల్యే ఆమంచి కృష్ణమోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బహుశా ఇటీవల కాలంలో న్యాయస్థాన తీర్పులపై ఈ స్థాయిలో ధ్వజమెత్తిన నేత ఎవరూ లేరు. సహజంగానే కాస్త దూకుడుగా వ్యవహరించే ఆమంచి హైకోర్టు తీర్పుపై తన సహజ ధోరణిలో విమర్శలు గుప్పించారు.
డాక్టర్ సుధాకర్ కేసు ఒక పెటీ కేసు అని అన్నారు. అంతటితో ఆగి ఉంటే మాట్లాడుకోడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఆయన మరింత అసహనాన్ని ప్రదర్శించారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐ విచారణకు ఆదేశించడంపై యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా విస్తుపోయిందన్నారు.
కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదని, కానీ ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతోందని ఆయన తీవ్ర వ్యాఖ్య చేశారు. అంతేకాదు, కరోనా లేకపోతే హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉండేవాడినని ఆయన హెచ్చరించారు. చిన్న చిన్న కేసులకు కూడా సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. ప్రతి పొలీస్‌స్టేషన్‌కు అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఆఫీసులు పెట్టాల్సి ఉంటుందని ఆమంచి కృష్ణ మోహన్ అసహనం వ్యక్తం చేశారు.
నిజానికి డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. కానీ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందనే భయంతో బహిరంగంగా తమ అభిప్రాయాలను బయటికి వెళ్లడించలేకున్నారు.