కమ్మవారు కేరాఫ్ భాజపా

'తెలుగుదేశం ఇక తానాలో మాత్రమే మిగులుతుంది' ఇదీ భాజపా నాయకుడు రామ్ మాధవ్ చేసిన కామెంట్. తానా సభలకు వెళ్లి వచ్చి. అక్కడ సభ్యుల నుంచి కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొని వెనక్కు వచ్చిన…

'తెలుగుదేశం ఇక తానాలో మాత్రమే మిగులుతుంది' ఇదీ భాజపా నాయకుడు రామ్ మాధవ్ చేసిన కామెంట్. తానా సభలకు వెళ్లి వచ్చి. అక్కడ సభ్యుల నుంచి కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొని వెనక్కు వచ్చిన ఆయన ఈ కామెంట్ చేయడం వెనుక వున్న వ్యవహారాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తానాలో వుండేవాళ్లంతా ఎక్కువగా తెలుగుదేశం అభిమానులు, మద్దతుదారులు కనుక, ఇక్కడ తెలుగుదేశం దుకాణం ఖాళీ చేస్తే, మిగిలేది తానా సభ్యులే అని రామ్ మాధవ్ అని వుండొచ్చు.

కానీ వాస్తవ పరిస్థితి అలా కనిపించడం లేదు. ఎక్కడెక్కడ వున్న కమ్మ సామాజక వర్గ నాయకులను ఏరికోరి మరీ భాజపాలోకి తీసుకెళ్తున్నారు. సుజనా చౌదరితో మొదలైన ఈ చేరికలు ఇప్పుడు రాయపాటి సాంబశివరావు వరకు వచ్చాయి. చేరుతున్న రాజకీయనాయకుల నేపథ్యం చూస్తుంటే భాజపా తరపున రామ్ మాధవ్ డీల్ చేస్తున్న వారందరి ప్రొఫైల్ చాలావరకు ఒకలాగే వుంటొంది.

వీరిలో దాదాపు అందరూ వ్యాపార రాజకీయ నేపథ్యం కలిగివుండడం, అలాగే దాదాపు అంతా ఒకే సామాజికవర్గ నేపథ్యం కలిగివుండడం విశేషం. కన్నా లక్ష్మీనారాయణను భాజపా ఆంధ్రనేతగా ఫిక్స్ చేసినపుడు, కాపు సామాజిక వర్గానికి ఆ పార్టీ పెద్దపీట వేసి, వైకాపా, తేదేపాలోని సామాజిక వర్గాలకు చెక్ పెట్టే పనిచేస్తోందన్న భావన రాజకీయ పరిశీలకుల్లో కలిగింది. కానీ ఇప్పుడు ఆ పని అలావుంచి, కమ్మ సామాజిక వర్గ నేతలను పార్టీలోకి తీసుకెళ్లే పనిని ఉధృతంగా చేస్తుంటే అసలు భాజపా ఆలోచన ఏమిటి? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ద్వారా ఓ పని చేయాలనుకున్నారు. కమ్మ-కాపు సామాజిక వర్గాలను కలపి, వైకాపాకు చెక్ పెట్టాలనుకున్నారు. కానీ అది ఆయనకు సాధ్యంకాలేదు. భాజపా వైఖరి చూస్తుంటే ఇప్పుడు అదే పనిచేయాలని అనుకుంటుందో? లేదా ఆ దిశగా వ్యూహరచన చేస్తోందా? ఈ రెండూకాక, కమ్మ సామాజక వర్గ నాయకులను తీసుకుని, తేదేపాను ఖాళీ చేయాలని అనుకుంటోందా?

కానీ భాజపా ఓ విషయం అర్థం చేసుకోవాల్సి వుంది. కమ్మసామాజిక వర్గం ఎక్కడ, ఏపార్టీలో వున్నా, తెలుగుదేశం పార్టీ అనేది బతికి వున్నన్నాళ్లు, ఆ వర్గం సహాయ సహకారాలు ఆ పార్టీకే వుంటాయి. మరో నాలుగేళ్ల తరువాత ఎన్నికలు దగ్గరకు వస్తాయో, ఆ వేళకు పరిస్థితులు ఎలా వుంటాయో తెలియదు. పరిస్థితులు తెలుగదేశం పార్టీకి ఏమాత్రం అనుకూలం అనిపించినా, ఇప్పుడు భాజాపాలో కోరి చేర్చుకున్న కమ్మ సామాజిక వర్గం అక్కడ మిగలమన్నా మిగలదు.

అయితే తెలుగుదేశం పార్టీని నాలుగేళ్ల తరువాత అస్సలు కోలుకోకుండా చేయాలన్న ఆలోచనే ప్రస్తుతానికి భాజపాకు వున్నట్లు కనిపిస్తోంది. రామ్ మాధవ్ తేదేపా కేరాఫ్ తానా అని అన్నారు కానీ, తేదేపా కమ్మ సామాజిక వర్గం కేరాఫ్ భాజపా అని తన స్టేట్ మెంట్ ను సవరించుకోవాలేమో?

పూరి చూసిన ఎత్తుపల్లాలు ఏమిటి