రాజ‌ధానిపై కీల‌క నిర్ణ‌యం…జ‌గ‌న్ స‌ర్కార్ క‌స‌ర‌త్తు!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొద‌టి రోజే జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. మ‌రోసారి మూడు రాజ‌ధానుల‌పై ప్ర‌భుత్వం చ‌ట్ట‌స‌భ వేదిక‌గా ముంద‌డుగు వేసే అవ‌కాశం…

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొద‌టి రోజే జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. మ‌రోసారి మూడు రాజ‌ధానుల‌పై ప్ర‌భుత్వం చ‌ట్ట‌స‌భ వేదిక‌గా ముంద‌డుగు వేసే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు ఎమ్మెల్యేల‌కు ముంద‌స్తు స‌మాచారం ఇచ్చిన‌ట్టు తెలిసింది. రాజ‌ధానిపై జ‌గ‌న్ స‌ర్కార్ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది.

ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ ప్రాంతాల‌కు రాజ‌ధాని రావాల్సిన అవ‌శ్య‌క‌త‌పై బ‌ల‌మైన వాద‌న వినిపించాల‌ని సూచించిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే బాగా మాట్లాడ‌గ‌లిగే ఎమ్మెల్యేల‌ను గుర్తించి, ప్రిపేర్ కావాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు ఆదేశించార‌ని తెలిసింది. దీంతో స‌ద‌రు ఎమ్మెల్యేలు త‌మ ప్రాంతానికి జ‌రిగిన చారిత్ర‌క ద్రోహాన్ని చ‌ట్ట‌స‌భ వేదిక‌గా ఏపీ స‌మాజానికి చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఒక వైపు అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొనసాగించాల‌ని రెండో ద‌ఫా పాద‌యాత్ర చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఈ పాద‌యాత్ర త‌మ ప్రాంతాల‌పై దండ‌యాత్రే అని రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, మంత్రులు గ‌ట్టిగా విమ‌ర్శిస్తున్నారు. త‌మ ప్రాంతంలో పాద‌యాత్ర‌ను అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. పాద‌యాత్ర సాగుతున్న‌ప్పుడే రాజ‌ధానిపై మ‌రోసారి కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం వుంది.

రాజ‌ధానిపై తాడోపేడో తేల్చుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది. రానున్న రెండు మూడు రోజుల్లో ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఏంటో తెలియ‌నుంది. దీనిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది. కోర్టు ధిక్క‌ర‌ణ లేకుండా జ‌గ‌న్ స‌ర్కార్ రాజ‌ధానిపై ఎలా ముందుకొస్తుంద‌నేదే చ‌ర్చ‌.