వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణల పరంపర కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య గతంలో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. వివేకానందరెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డి అక్యూస్డ్ ఫైవ్ గా ఉన్నారు. ఆయనను సీబీఐ అరెస్టు కూడా చేసింది. బెయిల్ దక్కనీయడం లేదు.
ఈ కేసులో తన భర్తను కాదని, ఇందులో విచారించవలసిన వ్యక్తులు మరి కొందరు ఉన్నారంటూ శివశంకర్ రెడ్డి భార్య గతంలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ తాజాగా కడప కోర్టులో విచారణకు వచ్చింది.
వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన బామ్మర్ది శివప్రకాష్, తెలుగుదేశం పులివెందుల నియోజకవర్గం ఇన్ చార్జి బీటెక్ రవితో సహా మరో ఇద్దరిని ఈ కేసులో సీబీఐ విచారించడం లేదంటూ.. ఈ మేరకు సీబీఐకి విచారణ ఆదేశాలు ఇచ్చేట్టు చూడాలంటూ శివశంకర్ రెడ్డి భార్య కోర్టును కోరింది.
ఇందుకు సంబంధించి ఆమె నుంచి పూర్తి వివరాలతో తమకు నివేదికను ఇవ్వాలంటూ కోర్టు ఆదేశిస్తూ, తదుపరి విచారణను రెండు నెలల తర్వాతకు వాయిదా వేసింది. ఇలా వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ న్యాయస్థానాల్లో మలుపులు తిరుగుతూ సాగుతూ ఉంది.
ఇక వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన అరెస్టులు ఉంటాయంటూ రెండు నెలల కిందటే బాగా హడావుడి జరిగింది. మీడియాలో ఈ మేరకు సీబీఐ లీకులు గుప్పుమన్నాయి. ఆ తర్వాత ఈ కేసు విచారణ స్తబ్ధుగానే కొనసాగుతున్నట్టుగా ఉంది.