తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వేలాదిగా తరలి వచ్చారు. వీరిలో వీఆర్ఏలు, కొందరు ఉపాధ్యాయులు, మత్స్యకారులు, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేసేవాళ్లు ఉన్నారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. హైదరాబాద్ మహానగరం నిరసనకారులతో పోటెత్తింది. అసెంబ్లీ ముట్టడికి మొత్తం ఏడు సంఘాలు పిలుపునిచ్చాయి.
పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి వచ్చిన నిరసనకారులను చూసి తెలంగాణ సర్కార్ ఒక్కసారిగా షాక్కు గురైంది. ముఖ్యంగా వీఆర్ఏల్లో ఈ స్థాయిలో నిరసన చూసి తెలంగాణ సర్కార్ చర్చ పేరుతో దిగి రాక తప్పలేదు. ఇవాళ తెలంగాణ రాజధాని హైదరాబాద్లో చోటు చేసుకున్న సీన్… ఫిబ్రవరిలో విజయవాడలో ఉద్యోగుల నిరసనను గుర్తు చేసింది.
పీఆర్సీ సాధన, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీలో ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపు నిచ్చారు. ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల నిర్బంధ చర్యలు చేపట్టింది. అయితే ఉద్యోగులు మాత్రం మారువేషాల్లో విజయవాడకు చేరుకున్నారు. అడుగడుగునా నిర్బంధాల్ని ఛేధించుకుని చివరికి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. చలో విజయవాడకు తరలివచ్చిన లక్షలాది ఉద్యోగులను చూసి జగన్ ప్రభుత్వం షాక్కు గురైంది. వారిని నిలువరించడం చేతకాక ఒక దశలో చేతులెత్తేసింది. చలో విజయవాడ పరిణామాలను అంచనా వేయడంలో ఏపీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా తెలంగాణలో కూడా అదే రకమైన ప్రచారం జరుగుతోంది. ఏపీలో టీచర్లు, ఇతర విభాగాల ఉద్యోగులందరూ ఆందోళనలో పాల్గొన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో వీఆర్ఏలు, కొన్ని సంఘాల ఉపాధ్యాయులు, ఇతర డిమాండ్లపై వచ్చిన నిరసన కారులు ఉన్నారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, మరోవైపు ముట్టడికి వేలాదిగా నిరసనకారులు తరలి రావడం ఆశ్చ ర్యం కలిగించింది. ఇందిరాపార్క్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గర 200 మంది వీఆర్ఏలను అరెస్ట్ చేయడం గమనార్హం.
ముఖ్యంగా వీఆర్ఏల నిరసనకు కేసీఆర్ సర్కార్ దిగి వచ్చింది. వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ చర్చలకు కూచున్నారు. తమకు పే స్కేల్ ఇవ్వాలని, అర్హులకు ప్రమోషన్, కారుణ్య నియామకాలు తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందు వీఆర్ఏలు పెట్టారు. పరిష్కారానికి కొంత సమయం కావాలని కేటీఆర్ అడిగారు. ఇందుకు వీఆర్ఏలు సమ్మతించారు. దీంతో వీఆర్ఏలు సమ్మె వాయిదా వేసుకున్నారు. ఈ నెల 18 తర్వాత మరోసారి చర్చలకు కూచోవాలని నిర్ణయించుకున్నారు.